Gold Price : కొత్త రికార్డు.. రూ. 1.31 లక్షల మార్కును దాటిన బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.

Update: 2025-10-16 06:45 GMT

Gold Price : బంగారం ధర వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్‌లోనూ దూకుడు చూపించింది. దేశ రాజధానిలోని బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర ఏకంగా రూ.1,000 పెరిగి, 10 గ్రాములకు రూ.1,31,800 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును తాకింది. ప్రస్తుత పండుగ సీజన్ కావడంతో రిటైలర్లు, ఆభరణాల విక్రేతల నుంచి కొనుగోళ్లు నిలకడగా కొనసాగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే, రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది.

అఖిల భారత బులియన్ అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం మంగళవారం నాడు తులం రూ.1,30,800 వద్ద ముగిసింది. స్థానిక బులియన్ మార్కెట్‌లో, బుధవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ.1,000 పెరిగి, అన్ని పన్నులతో కలిపి రూ.1,31,200 రికార్డు స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా, వెండి ధరలు రికార్డు స్థాయి నుంచి రూ.3,000 తగ్గి, కిలోకు రూ.1,82,000 (అన్ని పన్నులతో సహా) వద్ద స్థిరపడింది. అంతకుముందు మంగళవారం వెండి ధర రూ.6,000 పెరిగి కిలోకు రూ.1,85,000 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం.

అంతర్జాతీయ ధరల్లో భారీ పెరుగుదల, దేశీయంగా భౌతిక, పెట్టుబడి డిమాండ్ పెరగడం వల్ల బుధవారం బంగారం కొత్త రికార్డు ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,218.32 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. పండుగ కొనుగోళ్ల జోరు కారణంగా ఈ వృద్ధి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి నిరంతర కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో రిజర్వ్ బ్యాంకుల కొనుగోళ్లు బంగారం దీర్ఘకాలికంగా బలంగా ఉండటానికి విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,660 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి జోరు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు కూడా బంగారం, వెండి ధరలకు మరింత మద్దతునిస్తున్నాయి.

Tags:    

Similar News