Car Discount : ఎస్యూవీ కొనేందుకు ఇదే బెస్ట్ టైం.. దీపావళికి తక్కువ ధరకే కొత్త కారు మీ ఇంటికి తెచ్చుకోండి.
Car Discount : ఈ దీపావళి పండుగ సీజన్‌లో, కార్ల తయారీ సంస్థలు పండుగ కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి తమ ఎస్‌యూవీ మోడళ్లపై భారీ ఆఫర్‌లను ప్రకటించాయి. జీఎస్టీ 2.0 ద్వారా లభించిన ఊరటతో పాటు, కంపెనీలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్, ఇతర ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. మీరు గనుక కియా సోనెట్, సెల్టోస్, హ్యుందాయ్ వెన్యూ, టాటా పంచ్ లేదా నెక్సాన్ వంటి కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు అత్యంత సరైన సమయం. ఈ ఆఫర్లను ఉపయోగించుకొని మీరు భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
కియా ఇండియా సంస్థ తమ ప్రముఖ మోడళ్లు అయిన సోనెట్, సెల్టోస్ పై దీపావళి సందర్భంగా రూ.75,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ప్యాకేజీలో సాధారణంగా రూ.30,000 నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, సెల్టోస్ ఎస్‌యూవీపై సుమారు రూ.15,000 కార్పొరేట్ ప్రయోజనం ఉంటాయి. అయితే, ఈ ఆఫర్లు కారు వేరియంట్‌ను, నగరాన్ని బట్టి మారవచ్చు. సెల్టోస్ కంటే తక్కువ ధర కలిగిన సోనెట్ పై కూడా రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి.
హ్యుందాయ్ సంస్థ ఈ దీపావళికి తమ వెన్యూ ఎస్‌యూవీపై రూ.45,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ప్రయోజనాలలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, జీఎస్టీ తగ్గింపుతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. హ్యుందాయ్ ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో వెన్యూ ఒకటి. ఈ ఫెస్టివల్ బెనిఫిట్స్ కారణంగా, ఇప్పటికే అందుబాటు ధరలో ఉన్న ఈ కారు మరింత చవకగా లభిస్తోంది.
టాటా మోటార్స్ పండుగ సీజన్‌లో తమ పంచ్ ఎస్‌యూవీపై రూ.20,000 వరకు డిస్కౌంట్‌లు ప్రకటించింది. ఈ ప్రయోజనాలు సాధారణంగా నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ లేదా కార్పొరేట్ ప్రోత్సాహకాల రూపంలో ఉంటాయి. పంచ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్యాకేజింగ్, అత్యుత్తమ భద్రత కారణంగా, ఈ తగ్గింపులతో ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. ఇక, టాటా మెయిన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్ అన్ని వేరియంట్లపై రూ.25,000 వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ప్రయోజనాలలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, అర్హత కలిగిన ట్రిమ్‌లపై లాయల్టీ డిస్కౌంట్ ఉన్నాయి.