E-commerce : క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీలకు చెక్.. ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్రం షాక్.

Update: 2025-10-07 05:45 GMT

E-commerce : భారతదేశంలో ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం వేగంగా పెరుగుతుంది. అదే సమయంలో వారి పనితీరుపై ప్రశ్నలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్ల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్న కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి కంపెనీలపై దర్యాప్తును వేగవంతం చేసింది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై దర్యాప్తు చేస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇటీవల ఒక ట్వీట్‌లో.. ఇలాంటి చర్యలను డార్క్ ప్యాటర్న్స్ గా అభివర్ణించారు. అంటే, వినియోగదారులను మోసగించి, వారి నుంచి అదనపు డబ్బులు వసూలు చేసే తప్పుడు వ్యూహాలు అన్నమాట. ప్రభుత్వం వినియోగదారుల హక్కులను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటుందని, ఈ-కామర్స్ రంగంలో పారదర్శకత పెంచడానికి సంస్కరణలు చేపడుతుందని జోషి స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వినియోగదారులు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ద్వారా ఈ వివాదం బయటపడింది. కొన్ని కంపెనీలు పేమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జ్ పేరుతో అదనపు డబ్బులు తీసుకున్నట్లు రుజువైంది. అంతేకాకుండా, జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి యాప్‌లపై రెయిన్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలపై కూడా చాలా మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం యాక్షన్ మోడ్‌లో ఉంది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై గట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి జోషి హెచ్చరించారు.

వినియోగదారులతో అన్యాయంగా ప్రవర్తించవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించింది. దీనితో పాటు డార్క్ ప్యాటర్న్స్, ఎక్స్ ట్రా ఛార్జీల వసూళ్లను నిరోధించడానికి కొత్త చట్టాలను తీసుకురావడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొనుగోలు సమయంలో వినియోగదారులకు పూర్తి పారదర్శకత లభించేలా చూడడం, హిడెన్ ఛార్జీలు లేదా తప్పుడు ఆప్షన్లతో వినియోగదారులను మోసం చేయకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కేంద్రం తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల ఆన్‌లైన్ షాపింగ్ మరింత పారదర్శకంగా, వినియోగదారులకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News