Bharat Taxi : ఓలా, ఊబర్‌లకు కేంద్రం షాక్.. జనవరి 1 నుంచే భారత్ ట్యాక్సీ.
Bharat Taxi : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుకను ప్రకటించింది. జనవరి 1, 2026 నుంచి భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ సరికొత్త యాప్ ద్వారా సామాన్యులకు చౌకగా ప్రయాణం చేసే అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు ఓలా, ఊబర్, రాపిడో వంటి ప్రైవేట్ కంపెనీల ఛార్జీలతో విసిగిపోయిన ప్రయాణికులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం కానుంది. కేవలం కార్లే కాకుండా ఆటోలు, బైక్ సర్వీసులు కూడా ఈ భారత్ ట్యాక్సీలో అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా ప్రైవేట్ ట్యాక్సీ కంపెనీలు డ్రైవర్ల కష్టార్జితంలో సగం కంటే ఎక్కువ కమిషన్ రూపంలో తీసుకుంటాయి. కానీ భారత్ ట్యాక్సీలో ఆ పరిస్థితి ఉండదు. ఇందులో డ్రైవర్లకు తమ ఆదాయంలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నేరుగా దక్కుతుంది. మిగిలిన 20 శాతం మొత్తాన్ని కూడా ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమం, ఆపరేషన్ ఖర్చుల కోసమే ఉపయోగిస్తుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా, ప్రయాణికులకు కూడా ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 56,000 మంది డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారంటే ఈ సర్వీస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
భారత్ ట్యాక్సీ సర్వీసును తొలుత దేశ రాజధాని ఢిల్లీలో, ఆ తర్వాత గుజరాత్ లోని రాజకోట్ నగరంలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు నగరాల్లో ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో వచ్చే స్పందనను బట్టి అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలకు ఈ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రైవేట్ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకమైన ధరలతో సామాన్యులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.