Honda : హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గుతున్న ధరలు.

Update: 2026-03-04 09:45 GMT

Honda : కొత్త కారు కొనాలనుకునే వారికి మార్చి నెల అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా, ఈ నెలలో తన పాపులర్ కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. హోండా సిటీ, ఎలివేట్, అమేజ్ వంటి మోడళ్లపై దాదాపు రూ.1.97 లక్షల వరకు భారీ ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు మీరు ఎంచుకునే వేరియంట్, నగరాన్ని బట్టి మారవచ్చు. స్టాక్ ఉన్నంత వరకే ఈ వెసులుబాటు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

హోండా కార్లలో అన్నింటికంటే ఎక్కువ డిస్కౌంట్ హోండా సిటీ హైబ్రిడ్ మోడల్‌పై లభిస్తోంది. పర్యావరణ హితమైన ఈ కారుపై ఏకంగా రూ.1.97 లక్షల వరకు వెసులుబాటు ఉంది. ఇందులో 126hp శక్తినిచ్చే 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు ఇ-సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉంది. ఇక రెగ్యులర్ పెట్రోల్ సిటీ మోడల్‌పై రూ.1.56 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది 121hp పవర్‌ను ఇచ్చే 1.5 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.11.95 లక్షల నుంచి రూ.16.15 లక్షల మధ్య ఉన్నాయి.

మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో దూసుకుపోతున్న హోండా ఎలివేట్ పై కూడా ఈ నెలలో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీపై కస్టమర్లు రూ.1.81 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, కానీ హైబ్రిడ్ ఆప్షన్ మాత్రం అందుబాటులో లేదు. ఎలివేట్ ధరలు రూ.11.6 లక్షల నుంచి రూ.16.25 లక్షల వరకు ఉన్నాయి. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. పాత మోడల్‌పై రూ.68,000 వరకు, కొత్త తరం అమేజ్ పై రూ.57,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అమేజ్ ధరలు రూ.6.98 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

సేల్స్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 2026లో హోండా మొత్తం 7,212 వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు 66 శాతం తగ్గినప్పటికీ, దేశీయ మార్కెట్లో మాత్రం హోండా తన పట్టును నిలుపుకుంది. ముఖ్యంగా హోండా అమేజ్ కారు కంపెనీ సేల్స్‌ను ఆదుకుందని హోండా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో, మంచి ఫీచర్లతో లభిస్తున్న అమేజ్, ఫిబ్రవరిలో హోండాకు అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో మార్చి నెలలో విక్రయాలు మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

Tags:    

Similar News