Nissan Gravite : బడ్జెట్ ధరలో ఫ్యామిలీ ఎంపీవీ.. నిస్సాన్ గ్రావిటే డెలివరీలు షురూ.

Update: 2026-03-04 09:30 GMT

Nissan Gravite : జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ భారత మధ్యతరగతి కుటుంబాల కోసం సరికొత్త బడ్జెట్ కాంపాక్ట్ ఎంపీవీ గ్రావిటేను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.5.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు, రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ మోడల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్‌షిప్‌లకు చేరుకుంది. బుకింగ్స్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు కూడా జోరుగా సాగుతున్నాయి. తక్కువ ధరలో ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి గ్రావిటే ఒక చక్కని ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

డిజైన్ విషయానికి వస్తే, నిస్సాన్ తన సిగ్నేచర్ స్టైల్‌ను ఇందులోనూ కొనసాగించింది. కారు ముందు భాగంలో నిస్సాన్ ప్రత్యేకమైన వీ-మోషన్ గ్రిల్, దానికి ఇరువైపులా డే-టైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన పల్చని హెడ్‌లైట్లు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. బోనెట్‌పై Gravite అని రాసి ఉండటంతో పాటు, బంపర్‌పై సిల్వర్ ఫినిషింగ్, స్కిడ్ ప్లేట్ దీనికి రఫ్ అండ్ టఫ్ లుక్‌ను జోడించాయి. సైడ్ ప్రొఫైల్‌లో 15-అంగుళాల కొత్త డిజైన్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ ఆకట్టుకుంటున్నాయి. వెనుక వైపు షార్ప్ టెయిల్ ల్యాంప్స్, నిస్సాన్ లోగోతో కారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈ కారు మొత్తం ఐదు రంగుల్లో (ఫారెస్ట్ గ్రీన్, ఆనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, మెటాలిక్ గ్రే, స్టార్మ్ వైట్) లభిస్తోంది.

కారు లోపలి భాగం చాలా విశాలంగా, వినూత్నంగా ఉంది. ఏడుగురు సునాయాసంగా కూర్చునేలా సీటింగ్ లేఅవుట్‌ను డిజైన్ చేశారు. క్యాబిన్‌లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ను ఉపయోగించడం వల్ల కారు లోపల చాలా రిచ్‌గా కనిపిస్తోంది. టెక్నాలజీ పరంగా కూడా నిస్సాన్ ఎక్కడా తగ్గలేదు. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్‌లో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీనికి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లే వారికి ఈ సౌకర్యాలు మంచి అనుభూతినిస్తాయి.

ఇక ఇంజిన్ మరియు పనితీరు విషయానికి వస్తే, గ్రావిటేలో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 71 హార్స్‌పవర్ శక్తిని, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిస్సాన్ ప్రత్యేకంగా ట్యూన్ చేసిన ఇంజిన్. కస్టమర్లు ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఏఎమ్‌టీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మైలేజ్ విషయంలో కూడా ఇది వాహనదారులను నిరాశపరచదు. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 19.3 కిమీ, ఏఎమ్‌టీ వెర్షన్ 19.6 కిమీ మైలేజీని ఇస్తాయి. రాబోయే రోజుల్లో ఇందులో సీఎన్‌జీ వెర్షన్ కూడా తీసుకురానున్నట్లు నిస్సాన్ ధృవీకరించింది. తక్కువ ధర, ఎక్కువ సీట్లు, మంచి మైలేజ్.. ఇవన్నీ కలిపి గ్రావిటేను సెగ్మెంట్ లీడర్‌గా మార్చేలా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News