Hyundai : హ్యుందాయ్ భారీ ప్లాన్.. 2030 నాటికి 8 హైబ్రిడ్లతో సహా 26 కొత్త మోడల్స్.

Update: 2025-10-16 10:55 GMT

Hyundai : భారత మార్కెట్‌లో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 8 హైబ్రిడ్ వాహనాలతో సహా మొత్తం 26 కొత్త మోడల్స్‌ను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు తాము లేని రెండు కొత్త సెగ్మెంట్లు ఎంపీవీ, ఆఫ్ రోడ్ ఎస్యూవీలలోకి కూడా ప్రవేశించడానికి హ్యుందాయ్ సిద్ధమవుతోంది. అయితే, రాబోయే ఈ కొత్త మోడల్స్ పేరు లేదా పూర్తి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కాంపాక్ట్ ఫ్యామిలీ-మూవర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి, కియా సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి తమ కొత్త ఎంపీవీ సిద్ధంగా ఉందని హ్యుందాయ్ కన్ఫాం చేసింది. హ్యుందాయ్ సంస్థ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2024 లో స్టారియా, స్టార్‌గేజర్ ఎంపీవీలను ప్రదర్శించింది. వీటిలో హ్యుందాయ్ స్టార్‌గేజర్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. థాయ్‌లాండ్‌లో ఈ ఎంపీవీ 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 6-స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ ఆటోమేటిక్ అనే రెండు గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తోంది. స్టార్‌గేజర్ 4.46 మీటర్ల పొడవుతో, కియా కార్నివాల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.

హ్యుందాయ్ తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి ఒక మోనోకాక్ ఆల్-వీల్ డ్రైవ్ ఎస్యూవీని భారత్‌లో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ కొత్త హ్యుందాయ్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ.. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఇటీవల విడుదలైన మారుతి విక్టోరిస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా, జిమ్నీ వంటి ప్రముఖ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలు ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై ఆధారపడి 4X4 సామర్థ్యాలను అందిస్తున్నాయి. వాటికి భిన్నంగా హ్యుందాయ్ మోనోకాక్ AWD ని తీసుకురానుంది.

దక్షిణ కొరియాకు చెందిన ఈ వాహన తయారీ సంస్థ భారత మార్కెట్ కోసం 8 కొత్త హైబ్రిడ్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా ధృవీకరించింది. కొత్త తరం హ్యుందాయ్ క్రెటా బ్రాండ్‌లో మొట్టమొదటి హైబ్రిడ్ మోడల్ అయ్యే అవకాశం ఉంది. ఇది 2027 లో విడుదలవుతుందని అంచనా. అదే సంవత్సరంలో కొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ, 2028 లో హ్యుందాయ్ పాలిసేడ్ కూడా విడుదల కానున్నాయి. హ్యుందాయ్ ఇప్పటికే ఉన్న కొన్ని మోడళ్లలో కూడా భవిష్యత్తులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News