ICICI Prudential AMC IPO : మార్కెట్లోకి ICICI గ్రూప్ ఐదో పవర్ హౌస్..నేడు రూ.10,602 కోట్ల ఐపీఓ ఓపెన్.

Update: 2025-12-12 07:15 GMT

ICICI Prudential AMC IPO : ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ భారీ ఐపీఓసెంబర్ 12, శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఐపీఓలో డిసెంబర్ 16, 2025 వరకు బిడ్లు వేయడానికి అవకాశం ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఏఎంసీ రూ.10,602.65 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఈ సంవత్సరంలో వచ్చిన నాల్గవ అతిపెద్ద ఐపీఓ కావడం విశేషం.

ఈ ఐపీఓ కోసం కంపెనీ ఒక షేరు ధరను రూ.2,061 నుంచి రూ.2,165 వరకు నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జరుగుతోంది. దీని అర్థం ఏమిటంటే.. ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి కొత్తగా డబ్బు రాదు. బదులుగా ప్రమోటర్లు (వాటాదారులు) తమ వద్ద ఉన్న షేర్లను అమ్ముకొని, ఆ డబ్బును నేరుగా తీసుకుంటారు. ఈ లిస్టింగ్ ద్వారా ఐసీఐసీఐ గ్రూప్ నుంచి స్టాక్ మార్కెట్‌లో అడుగుపెడుతున్న ఐదో లిస్టెడ్ యూనిట్ గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నిలవనుంది.

ఐపీఓ మొదలవక ముందే కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో మంచి స్పందనను చూపిస్తున్నాయి. ప్రస్తుతం దీని గ్రే మార్కెట్ ప్రీమియం రూ.150 గా ఉంది. ఈ GMP ప్రకారం చూస్తే షేర్లు లిస్టింగ్ రోజున దాదాపు 7 శాతం లాభంతో మొదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఐపీఓ పబ్లిక్‌గా ప్రారంభమవడానికి ఒక రోజు ముందు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ 148 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.3,022 కోట్లు సమీకరించింది. ఈ యాంకర్ ఇన్వెస్టర్లలో పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. వీరికి ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ.2,165 చొప్పున షేర్లను కేటాయించారు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అనేది ఐసీఐసీఐ బ్యాంక్, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ పీఎల్‌సీ సంయుక్త సంస్థ. ఈ ఐపీఓకు ముందు, ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ తమ 4.5% వాటాను ఒక్కో షేరుకు రూ.2,165 చొప్పున రూ.4,815 కోట్లకు విక్రయించింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వారసులు వంటి ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు.

Tags:    

Similar News