Fake Email : ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఒక్క క్లిక్‌తో మీ జేబు ఖాళీ.
Fake Email : ఇటీవల కాలంలో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఫేక్ రీఫండ్ ఈ-మెయిల్స్, మెసేజ్‌లు భారీగా వ్యాపిస్తున్నాయని ట్యాక్స్‌పేయర్‌లను ఐటీ శాఖ హెచ్చరించింది. ఈ ఈ-మెయిల్‌లు అచ్చం అధికారికంగా కనిపించినా, నిజానికి ఇవి ఫిషింగ్ దాడులు. స్కామర్‌లు ఈ మెయిళ్ల ద్వారా మీకు వెంటనే రీఫండ్ వస్తుంది అని నమ్మించి, నకిలీ లింక్‌లపై క్లిక్ చేయమని వినియోగదారులను ప్రేరేపిస్తారు. ఈ లింక్‌లపై క్లిక్ చేసి, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు లేదా ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేస్తే, ఆ డేటా చోరీకి గురై, బ్యాంక్ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఈ రకమైన మెయిల్స్‌లో చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు లేదా అసాధారణ లింకులు ఉంటాయని ఐటీ శాఖ వెల్లడించింది.
నకిలీ రీఫండ్‌లే కాకుండా ఆదాయపు పన్ను ఫైలింగ్‌లో ఫేక్ డిడక్షన్స్, మినహాయింపుల మోసాలు కూడా బయటపడ్డాయి. కొంతమంది ఏజెంట్లు కమీషన్ల కోసం దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసి, తప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నారని ఐటీ శాఖ గుర్తించింది. పన్ను ఆదా చేసుకోవడానికి, రిజిస్టర్డ్ కాని గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (RUPPs) లేదా కొన్ని ధార్మిక సంస్థల పేరు మీద ఈ తప్పుడు క్లెయిమ్‌లు చేస్తున్నారు. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అధునాతన డేటా అనలిటిక్స్ , AI-ఆధారిత ప్రొఫైలింగ్ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. బ్యాంకింగ్ రికార్డులు, ఫారం 26AS, పాన్ డేటాబేస్ వంటి వివరాలను క్రాస్-చెక్ చేయడం ద్వారా అసాధారణ పద్ధతులను గుర్తించి, అవకతవకలు జరిగిన చోట సెక్షన్ 132, 133A ల కింద తనిఖీలు నిర్వహిస్తోంది.
ఐటీ శాఖ ట్యాక్స్‌పేయర్‌లకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చింది. ట్యాక్స్‌కు సంబంధించిన అన్ని సమాచారాన్ని కేవలం అధికారిక వెబ్‌సైట్ www.incometax.gov.in నుండి మాత్రమే ధృవీకరించుకోవాలి. ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. ఏ అధికారిక ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ కూడా మీ పాస్‌వర్డ్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు లేదా ఆధార్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పటికీ అడగదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. మీకు ఏదైనా అనుమానాస్పద ఈ-మెయిల్ వస్తే, దాన్ని వెంటనే webmanager@incometax.gov.in కు ఫార్వార్డ్ చేసి, ఒక కాపీని incident@cert-in.org.in కు పంపించాలి. ఈ విధంగా అప్రమత్తంగా ఉండటం వలన మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు, ఆన్‌లైన్ ట్యాక్స్ మోసాలను అరికట్టడంలో సహాయపడవచ్చు.