Retail Loan : అప్పుల ఊబిలో భారత్? రూ. 162 లక్షల కోట్లకు చేరిన రిటైల్ లోన్లు.

Update: 2026-02-25 05:45 GMT

Retail Loan : భారతదేశంలో సామాన్యుల ఆర్థిక పరిస్థితిపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ప్రజలు అప్పుల కొండ మీద నిలబడ్డారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన రిటైల్ లోన్ డేటా ప్రకారం.. డిసెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా రిటైల్ రుణాల సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 18 శాతం వృద్ధితో మొత్తం రిటైల్ అప్పులు రూ.162 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బంగారంపై తీసుకునే రుణాల వృద్ధి ఏకంగా 44 శాతం పెరగడం గమనార్హం.

మంగళవారం విడుదలైన CRIF హై మార్క్ నివేదిక ప్రకారం.. 2025 డిసెంబర్ త్రైమాసికంలో అవుట్‌స్టాండింగ్ రిటైల్ లోన్లు రూ.162 లక్షల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదల, పండుగ సీజన్, జీఎస్‌టీ సవరణల ప్రభావం బంగారం రుణాలపై స్పష్టంగా కనిపించింది. గోల్డ్ లోన్లు 44.1 శాతం పెరిగి రూ.16.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక రిటైల్ రుణాల్లో సింహభాగం ఆక్రమించిన హోమ్ లోన్ విభాగం 10.5 శాతం వృద్ధితో రూ.43 లక్షల కోట్లకు చేరింది. పర్సనల్ లోన్ విభాగం కూడా 11.6 శాతం పెరిగి రూ.15.9 లక్షల కోట్లకు చేరుకుంది.

ఆటోమొబైల్ మరియు వినియోగదారుల వస్తువుల కొనుగోలుకు తీసుకునే రుణాల్లో కూడా మెరుగుదల కనిపిస్తోంది. ఆటో లోన్లు 14.6 శాతం, టూ-వీలర్ లోన్లు 12.3 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు 14.3 శాతం మేర పెరిగాయి. ఆస్తి నాణ్యత విషయంలో మాత్రం కొంత ఊరట లభించింది. 30 నుంచి 180 రోజులు బకాయి ఉన్న రుణాలు గత ఏడాది 3.2 శాతంగా ఉండగా, ఈసారి అది 2.8 శాతానికి తగ్గింది. ఇది ప్రజలు రుణాలను సకాలంలో చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తోంది.

హోమ్ లోన్ల విషయంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. యాక్టివ్ హోమ్ లోన్ల సంఖ్య 3.3 లక్షలు పెరిగింది, దీనివల్ల సగటు లోన్ మొత్తం కూడా పెరిగింది. ఢిల్లీలో హోమ్ లోన్ వృద్ధి కేవలం 7.7 శాతంతో నెమ్మదిగా ఉండగా.. తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం మార్కెట్ సగటు కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో, మూడో త్రైమాసికంలో సగానికి పైగా రుణాలు ప్రభుత్వ బ్యాంకుల నుంచే జారీ అవ్వడం విశేషం.

Tags:    

Similar News