Tax Collection : ప్రభుత్వ ఖజానా గలగల.. పన్నుల వేటలో కేంద్రం రికార్డు.. 17 లక్షల కోట్లు దాటిన ఆదాయం.
Tax Collection : కేంద్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం వచ్చి చేరుతోంది. 2025 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు అందిన గణాంకాల ప్రకారం, భారత ప్రభుత్వం 17.04 లక్షల కోట్ల రూపాయల నికర ప్రత్యక్ష పన్నులను వసూలు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పన్ను వసూళ్లు 8 శాతం మేర పెరగడం విశేషం. ముఖ్యంగా కార్పొరేట్ పన్నులు పెరగడం, రిఫండ్లు తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా మెరుగుపడింది.
ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వృద్ధిలో కార్పొరేట్ పన్నుల వాటా చాలా కీలకంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ మధ్య నాటికి కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 7.39 లక్షల కోట్లుగా ఉండగా, ఈ ఏడాది అవి రూ. 8.17 లక్షల కోట్లకు చేరాయి. అంటే మొత్తం పన్ను ఆదాయంలో దాదాపు సగం వాటా కంపెనీలు చెల్లించిన పన్నుల నుంచే వస్తోంది. ఇది దేశంలోని కార్పొరేట్ సంస్థల లాభాలు మెరుగ్గా ఉన్నాయనడానికి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఈ ఏడాది పన్ను ఆదాయం పెరగడానికి మరో ప్రధాన కారణం రిఫండ్లు తగ్గడం. సాధారణంగా పన్ను చెల్లింపుదారులకు తిరిగి ఇచ్చే రిఫండ్ల మొత్తం ఈసారి సుమారు రూ. 2.97 లక్షల కోట్లు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే రిఫండ్లు దాదాపు 13.52 శాతం తగ్గాయి. ఆదాయపు పన్ను శాఖ రిఫండ్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తప్పుడు క్లెయిమ్‌లను అడ్డుకోవడానికి స్క్రీనింగ్ పెంచడం వల్ల చాలా మందికి రిఫండ్లు ఆలస్యం అవుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యాల విషయానికొస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు అందిన రూ. 17.04 లక్షల కోట్లు పోగా, మిగిలిన మూడు నెలల్లో మరో 8.15 లక్షల కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పుల వల్ల అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు కొంత తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా ప్రభుత్వ ఆదాయం మాత్రం ఆశాజనకంగానే ఉంది.