Inflation : ద్రవ్యోల్బణంలో 8 ఏళ్ల రికార్డు.. ఆహార వస్తువుల ధరల తగ్గుదలే ప్రధాన కారణం.

Update: 2025-10-14 05:42 GMT

Inflation : భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో భారీగా తగ్గి కేవలం 1.54 శాతంగా నమోదైంది. గత ఎనిమిదేళ్లలో (జూన్ 2017 తర్వాత) ఒక నెలలో ఇంత తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ద్రవ్యోల్బణం పరిమితి కంటే కూడా ఇది చాలా తక్కువగా ఉండటం గమనార్హం. గత నెల ఆగస్టులో నమోదైన 2.07 శాతం కంటే, సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం ఏకంగా 53 బేసిస్ పాయింట్లు తగ్గింది.

ద్రవ్యోల్బణం తగ్గుదల విషయంలో ఆర్థిక నిపుణుల అంచనాలను సెప్టెంబర్ గణాంకాలు మించిపోయాయి. ఆగస్టులో 2.07 శాతం ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2 శాతం కంటే దిగువకు పడిపోతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, వారి అంచనా కంటే కూడా ఎక్కువగా తగ్గి, 1.54 శాతానికి చేరుకోవడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. 2022లో ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

ద్రవ్యోల్బణం ఇంత భారీగా తగ్గడానికి అనేక కారణాలు దోహదపడ్డాయి. ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు వంటి కఠిన నిర్ణయాల ప్రభావం, సానుకూల వాతావరణ పరిస్థితులు, మంచి వ్యవసాయ పంట దిగుబడి వంటివి ధరలు నిలకడగా తగ్గడానికి దారితీశాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలని ప్రభుత్వం ఆర్బీఐకి లక్ష్యం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్బీఐ దాదాపుగా విజయం సాధించింది. ఆర్బీఐ నిర్ణయించిన 2 శాతం నుంచి 6 శాతం ద్రవ్యోల్బణం టాలరెన్స్ పరిమితి నుంచి, ఇప్పుడు ద్రవ్యోల్బణం మొట్టమొదటిసారిగా బయటకు వచ్చింది.

సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం ఇంత గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరలు తగ్గడం. రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కల్లో ఆహార వస్తువుల ధరలకే దాదాపు సగం ప్రాధాన్యత ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఈ ఎంపిక చేసిన ఆహార వస్తువుల సగటు ధర మైనస్ 2.28 శాతంగా నమోదైంది. అంటే, గత సంవత్సరం సెప్టెంబర్ నెలతో పోలిస్తే, ఈసారి వాటి ధరలు తగ్గాయని అర్థం.

ఆహార వస్తువుల్లో ముఖ్యంగా కూరగాయల ధరలు భారీగా పడిపోయాయి. సెప్టెంబర్ నెలలో కూరగాయల ధర ఏకంగా 21.38 శాతం మేర తగ్గింది. గత నెల ఆగస్టులో కూరగాయల ధర 15.92 శాతం తగ్గింది. అంటే, కేవలం రెండు నెలల్లోనే కూరగాయల ధరలు సుమారు 37 శాతం తగ్గాయి. ఈ ధరల భారీ తగ్గుదలే మొత్తం ద్రవ్యోల్బణం పడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది.

Tags:    

Similar News