IT: ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో ఉద్యోగాల కోత... కంపెనీల ఆచితూచి నియామకాలు;

Update: 2025-07-27 07:30 GMT

దేశంలో టెక్నాలజీ పరుగులు తీస్తోంది. సాంకేతికత పెరిగి నేడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వైపు చూస్తోంది. లాభాలనే ధ్యేయంగా చూసే ప్రముఖ కంపెనీలు సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ శ్రామిక శక్తిని పక్కకు నెడుతున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. నియామకాలు తగ్గుతున్నాయి. ప్రముఖ కంపెనీలలోని ఉద్యోగులంతా అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. ఇక ఐటీ రంగంలో నియామకాల భవిష్యత్ ఆశాజనకంగా కనిపించడం లేదు. కంపెనీలు ఇప్పటికే ఆచితూచి నియామకాలు జరుపుతున్నాయి. గత రెండేళ్లలో ఐఐటీలతో సహా ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ప్రాంగణ నియామకాలు భారీగా తగ్గాయి. అమెరికా, యూర్‌పల నుంచి మన ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గడం ఇందుకు ఒక కారణమైతే, ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) వంటి సరికొత్త టెక్నాలజీలు ఇందుకు మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.

తగ్గిన ఉద్యోగులు.. ఆదాయంలో వృద్ధి

భారత ఐటీ రంగంలో కొత్త నియమకాలు గణనీయంగా తగ్గాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టాప్-6 టెక్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య కేవలం 3,847 పెరిగింది. ఇది అంతకు ముందు త్రైమాసికం జనవరి-మార్చిలో నమోదైన 13,935 ఉద్యోగులతో పోలిస్తే 72 శాతం తక్కువ కావడం గమనార్హం. ఈ స్థాయిలో కొత్త ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ కంపెనీల్లోనే ఉద్యోగుల సంఖ్య పెరగగా.. హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, టెక్ మహీంద్రాలో మొత్తంగా 1,423 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఐటీ రంగంలో ఆదాయ వృద్ధి ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గినా ఆదాయంలో వృద్ధి కనిపిస్తోంది. ఏఐ సాంకేతికతలు, ఆటోమేషన్, క్లౌడ్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేసేందుకు వీలు లభించడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉన్న ఉద్యోగులతో ఎక్కువ వర్క్

'ఏఐ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీ ఐటీ సెక్టార్‌లో నియామకాల తీరును మార్చేస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడం కంటే, ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగుపరిచి, వారితోనే ఉత్పాదకతను పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి' అని రిక్రూట్‌మెంట్ సంస్థ రాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అన్నారు.

తగ్గిన ఎంట్రీ లెవెల్ నియామకాలు

టీమ్‌లీస్ డేటా ప్రకారం.. గతంలో ఐటీ కంపెనీలలో ఎక్కువగా ఉన్న ఎంట్రీ లెవెల్ నియామకాలు పాండమిక్‌కు ముందు సంవత్సరాలతో పోలిస్తే 50 శాతం తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు రావడంతో కొంత మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, నియామకాలు నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. గత స్థాయిలకు చేరుకోలేదని టీమ్‌లీస్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ అన్నారు. ప్రస్తుతం టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్-6 ఐటీ కంపెనీల్లో 16.25 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఇది 2022 జూన్ నాటి 16.58 లక్షల కంటే చాలా తక్కువ. 2025 తొలి ఆరు నెలల్లో ఉద్యోగుల సంఖ్యలో సానుకూల మార్పు కనిపించింది. మూడేళ్లలో తొలిసారి సానుకూలంగా ఉంది. 2023, 2024 తొలి ఆరు నెలల్లో వరుసగా 14 వేలు, 32 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ ఈ ఏడాది ఆ స్థాయిలో తగ్గక పోవడం కాస్త ఊరట కల్పించే విషయమనే చెప్పాలి.

Tags:    

Similar News