LAYOFFS: టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత
రెండేళ్లుగా టెకీలకు ప్రమాద ఘంటికలు... భారీగా తొలగిస్తున్న దిగ్గజ సంస్థలు;
టెక్ రంగాన్ని సుదీర్ఘకాలంగా గ్లోబల్ ఎకానమీకి వెన్ను దన్నుగా భావించారు. కానీ గత రెండేళ్లుగా ఆ రంగంలోనే ఉద్యోగాలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా 2024 చివరి త్రైమాసికం నుంచీ 2025 మొదటి వరకూ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఉద్యోగులను వదులుకోవడం అనేకమందిలో భయం, అనిశ్చితిని పెంచుతోంది. ఈ ఏడాది తొలి ఆ నెలల్లో 62,000 మందికి పైగా ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటిదాకా వచ్చిన లేఆఫ్ ప్రకటనల ప్రకారం, ఈ సంఖ్య జూలై కల్లా లక్ష మార్కును దాటి వెళ్లే అవకాశం ఉంది.
ఎందుకు ఈ ఊచకోత?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం: అనేక కంపెనీలు ఇప్పుడు AI ఆధారిత టూల్స్‌ను వినియోగిస్తూ మానవ వనరులపై ఆధారపడే తత్వాన్ని తగ్గిస్తున్నాయి. మానవ మేధస్సుతో జరిగే పనులను యంత్రాలు, ఆల్గోరిథంలతో స్వయంచాలకంగా నిర్వహించడం వల్ల ఉద్యోగులు అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. కొత్త వ్యాపార మోడళ్ల అన్వేషణ: వృద్ధి లేని మార్కెట్లలో టెక్ సంస్థలు ఇప్పుడు ఆదాయ మార్గాలను విస్తరించేందుకు వ్యూహాత్మక మార్పులు చేపడుతున్నాయి. ఇది కంపెనీ మూలవ్యవస్థలో మార్పులకు దారితీస్తోంది. ఫలితంగా, పాత పనివిధానాల్లో ఉన్న ఉద్యోగులపై ముప్పు పెరిగింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి: అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో మాంద్యం సంకేతాలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు కంపెనీల ఖర్చు తగ్గింపు నిర్ణయాలకు దారితీస్తున్నాయి.
ఉద్యోగాల కోతలు ఏ సంస్థలో ఎలా?
ఇంటెల్: 2025కి ముందు $3 బిలియన్ల వ్యయం తగ్గించాలన్న లక్ష్యంతో పలుచోట్ల ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
గూగుల్: ఇటీవల గ్లోబల్ రిక్రూట్మెంట్ టీం నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.
మైక్రోసాఫ్ట్: గేమింగ్, క్లౌడ్ సెగ్మెంట్లలో పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వందలాది ఉద్యోగాలను కోతకు గురిచేసింది.
అమెజాన్: డివైజ్, ఫ్రెష్, స్టోర్స్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించడంతో పాటు, పునఃనిర్వాహణ ప్రక్రియ కొనసాగుతోంది.
బ్లాక్ (Fintech), బ్లూ ఆరిజన్ (Space-tech), SAP, Dell, eBay వంటి సంస్థలు కూడా కార్యకలాపాల్లో మినిమైజేషన్ స్ట్రాటజీ అమలు చేస్తున్నాయి.
భారతీయ టెక్ రంగంపై ప్రభావం:
ఇండియాలోని టెక్ కంపెనీలు ఇంకా బహుళజాతీయ సంస్థల సర్వీస్ సెంటర్లు ఈ ప్రభావాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నాయి. టాప్ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్, టీసీఎస్‌లలో నూతన నియామకాల జాప్యం, ఇంటర్న్‌షిప్‌ల నిలిపివేత వంటి సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
భవిష్యత్తు దారి?
టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోతటెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోతఈ తరహా ఉద్యోగ కోతలు పరిశ్రమల మార్పును సూచిస్తున్నప్పటికీ, అదే సమయంలో కొత్త అవకాశాలకు కూడా ద్వారాలు తెరిచే అవకాశం ఉంది. AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే యువతకు కొత్త అవకాశాలు లభించొచ్చు. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే… “స్టెబిలిటీ” అనే పదం టెక్ రంగంలో అపరిచితంగానే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.