ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో 247 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని రూ.5,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనుంది. మే 8న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్లాంట్‌లో ఫ్రిడ్జీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారుచేస్తారు. దీని ద్వారా 1,495 మంది ప్రత్యక్షంగా ఉద్యోగం పొందనుండగా, పరోక్షంగా 11,000 మందికి పైగా ఉపాధి కలగనుంది. సంస్థ లక్ష్యం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించడమే. సంస్థకు అనుబంధంగా నలుగురు సప్లయర్లు కూడా భారత మార్కెట్లోకి ప్రవేశించి ₹839 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొత్తం పెట్టుబడి నాలుగు ఏళ్లలో రూ.5,000 కోట్లు మించవచ్చని అంచనా. ఈ పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. 20 ఏళ్లపాటు నీటి వినియోగంపై 100% సబ్సిడీ, విద్యుత్ ఛార్జీలపై 50% రాయితీతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు లభించనున్నాయి. ఈ పెట్టుబడిని రాష్ట్రానికి ఆకర్షించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడితో దక్షిణ భారతదేశంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కి ఇది అతిపెద్ద మేనుఫాక్చరింగ్ హబ్‌గా మారనుంది.