Upcoming Cars : మార్చిలో కార్ల జాతర.. రోడ్ల మీదకు మూడు కొత్త ఎస్‌యూవీలు.
Upcoming Cars : భారతీయ ఆటోమొబైల్ ప్రేమికులకు మార్చి 2026 ఒక పండగలా మారబోతోంది. ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న మూడు పవర్ఫుల్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలు కార్ లవర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్, అప్‌డేటెడ్ స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టయోటా నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ అబెల్లా ఈ నెలే షోరూమ్‌లకు రానున్నాయి. ఈ మూడు కార్లు కూడా తమదైన ప్రత్యేకతలతో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.
అన్నింటికంటే ముందుగా, ఎప్పుడో పదేళ్ల క్రితం ఇండియాలో ఎస్‌యూవీ క్రేజ్‌ను మొదలుపెట్టిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో మార్చి 17న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి, ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కొత్త డస్టర్‌లో రెండు రకాల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో 1.3 లీటర్ ఇంజిన్ ఏకంగా 163 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తూ ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ కారుగా నిలవబోతోంది. అంతేకాకుండా, మైలేజీ లవర్స్ కోసం 1.8 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ వెర్షన్‌ను కూడా 2026 దీపావళి నాటికి తీసుకురావడానికి రెనాల్ట్ ప్లాన్ చేస్తోంది.
ఇక స్టైలిష్ కార్లకు మారుపేరుగా నిలిచే స్కోడా నుంచి కుషాక్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేటెడ్ ఫీచర్లతో రాబోతోంది. ఈ కొత్త మోడల్‌లో మునుపటి కంటే మెరుగైన డిజైన్, సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా మసాజ్ ఫీచర్ ఉన్న వెనుక సీట్లను ప్రవేశపెడుతున్నారు. లాంగ్ జర్నీ చేసే వారికి ఈ ఫీచర్ ఒక గొప్ప ఊరటనిస్తుంది. ఇంజిన్ పరంగా చూస్తే, 1.0 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌కు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనివల్ల డ్రైవింగ్ అనుభూతి మరింత స్మూత్‌గా ఉండబోతోంది. రాబోయే కొద్ది వారాల్లోనే దీని ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
వీటన్నింటికీ భిన్నంగా టొయోటా తన మొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాతో ఈవీ మార్కెట్‌ను షేక్ చేయబోతోంది. ఈ కారు E1, E2, E3 అనే మూడు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు (49kWh, 61kWh) ఉన్నాయి. చిన్న బ్యాటరీతో సింగిల్ ఛార్జ్‌పై 440 కిలోమీటర్ల రేంజ్ వస్తుండగా, పెద్ద బ్యాటరీ ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఐదు మోనోటోన్, నాలుగు డ్యూయల్ టోన్ రంగుల్లో లభించే ఈ కారు, ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.
మొత్తానికి మార్చి నెలలో రాబోతున్న ఈ మూడు కార్లు భారతీయ రోడ్లపై కొత్త సంచలనానికి తెరలేపనున్నాయి. అటు పెట్రోల్ పవర్ కావాలనుకునే వారికి డస్టర్, లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి కుషాక్, పర్యావరణ హితంగా ఉండాలనుకునే వారికి అబెల్లా ఈవీ.. ఇలా ప్రతి ఒక్కరికీ ఒక అదిరిపోయే ఛాయిస్ అందుబాటులోకి వస్తోంది. కంపెనీల మధ్య పెరుగుతున్న ఈ పోటీ వల్ల అంతిమంగా వినియోగదారులకే మంచి ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఉన్న కార్లు తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది.