ఒకవైపు పెట్రోలు ధరల పెంపు.. మరో వైపు ఎల్పీజీ సిలిండర్‌పై బాదుడు
వంటింట్లో వాడుకునే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై మరో యాభై రూపాయలు పెంచాలని చమురు సంస్థలు డిసైడయ్యాయి.;
అసలే పెట్రోలు ధరల పెరుగుదలతో సామాన్యుడి జేబు చినిగిపోతోంది. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదనేలా మరో వార్త వెలువడింది. వంటింట్లో వాడుకునే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై మరో యాభై రూపాయలు పెంచాలని చమురు సంస్థలు డిసైడయ్యాయి. పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరుపై మరో యాభై పెరగడంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.
ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండరు ధర 769కి చేరింది. ఇవాళ్టి నుంచి ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్‌లో సిలిండర్‌కు ఇవాళ్టి నుంచి 821 రూపాయలు చెల్లించాలి. ఒకప్పుడు 600లకు వచ్చే సిలిండర్ ధర ఇప్పుడు 800 దాటింది. బెంగళూరులో 772, చెన్నైలో 785, ముంబైలో 769, కోల్‌కతాలో 795కి చేరింది సిలిండర్ ధర.
ఇక వాహనాల ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 100 వైపు పరుగులు పెడుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బాదుడు ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.