Triumph : భారత రోడ్లపై ట్రయంఫ్ గర్జన.. కేవలం 2.5 ఏళ్లలోనే 1,00,000 బైక్‌ల విక్రయం.
Triumph : బ్రిటీష్ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ భారత మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండున్నర ఏళ్లలోనే లక్షకు పైగా ట్రయంఫ్ బైక్‌లు భారత రోడ్లపై పరుగులు తీస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బజాజ్ ఆటోతో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి దిగ్గజాలకు ట్రయంఫ్ గట్టి పోటీనిస్తోంది.
2023 రెండో త్రైమాసికంలో ప్రారంభమైన బజాజ్, ట్రయంఫ్ భాగస్వామ్యం భారత ప్రీమియం బైక్ మార్కెట్ రూపురేఖలను మార్చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, ట్రయంఫ్ బైక్‌ల తయారీ, పంపిణీ బాధ్యతలను బజాజ్ ఆటో చూసుకుంటోంది. బజాజ్ అత్యాధునిక తయారీ సామర్థ్యం, విస్తృతమైన డీలర్ నెట్‌వర్క్ ట్రయంఫ్‌కు కొండంత అండగా నిలిచాయి. కేవలం 2.5 ఏళ్లలోనే 1,00,000 యూనిట్ల విక్రయాలు సాధించడం ఈ భాగస్వామ్య విజయానికి నిదర్శనం.
200 నగరాల్లో 230కి పైగా స్టోర్లు
నెట్‌వర్క్ విస్తరణలో కూడా ట్రయంఫ్ దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200లకు పైగా పట్టణాల్లో ట్రయంఫ్ తన ఉనికిని చాటుకుంది. 230కి పైగా డీలర్‌షిప్‌లు, అవుట్‌లెట్‌ల ద్వారా కస్టమర్లకు చేరువయ్యింది. ముఖ్యంగా టైర్-2 నగరాల్లో కూడా ప్రీమియం బైక్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో, కంపెనీ తన సేవా కేంద్రాలను మరింతగా పెంచుతోంది.
భారత్ నుంచి 18 దేశాలకు ఎగుమతి
మేడ్ ఇన్ ఇండియా ట్రయంఫ్ బైక్‌లకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. భారత్‌లో తయారైన 400సీసీ శ్రేణి బైక్‌లను ప్రస్తుతం 18 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, తైవాన్, దక్షిణ కొరియా వంటి ప్రముఖ మార్కెట్లు ఉండటం విశేషం. భారతీయ ఇంజనీరింగ్ ప్రమాణాలు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుంటున్నాయని ఈ ఎగుమతులు రుజువు చేస్తున్నాయి.
ఏప్రిల్‌లో కొత్త 350సీసీ బైక్‌ల గర్జన
బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2026లో ట్రయంఫ్ నుంచి కొత్త 350సీసీ మోటార్‌సైకిళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న 400సీసీ బైక్‌లపై (Speed 400, Scrambler 400 X) అమల్లో ఉన్న GST 2.0 పన్ను నిబంధనల వల్ల ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. 350సీసీ లోపు బైక్‌లకు తక్కువ పన్ను ఉండటంతో, కొత్త బైక్‌లను మరింత పోటీ ధరలకే అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇది సామాన్య ప్రీమియం బైక్ ప్రియులకు గొప్ప శుభవార్త.