Maruti Grand Vitara : దీపావళి ధమాకా.. మారుతి గ్రాండ్ విటారాపై రూ. 1.80 లక్షల వరకు భారీ డిస్కౌంట్.
Maruti Grand Vitara : పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కార్ల కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్‌లో మంచి ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారా పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అక్టోబర్ 2025 నెల కోసం రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును ప్రకటించిన మారుతి, వివిధ వేరియంట్లపై ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది.
మారుతి సుజుకి తన నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారాపై అక్టోబర్ 2025 నెల కోసం ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు వేరియంట్‌లను బట్టి మారుతుంటాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ పై కంపెనీ రూ. 1.80 లక్షల వరకు భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
పెట్రోల్ వేరియంట్‌లపై కస్టమర్లు రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో డొమినియన్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాక్ (ధర రూ.57,900 వరకు) కూడా ఈ ఆఫర్‌లో భాగంగా చేర్చింది. సీఎన్‌జీ మోడళ్లు కొనుగోలు చేసే వారికి రూ. 40 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా వంటి వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.76 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి, టయోటాతో కలిసి సంయుక్తంగా గ్రాండ్ విటారాను అభివృద్ధి చేసింది. ఇందులో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్లో ఉన్న ఇంజన్ ఆప్షన్లే ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 1462సీసీ K15 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 RPM వద్ద దాదాపు 100 bhp పవర్, 4,400 RPM వద్ద 135 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఈ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లలో ఒకటిగా నిలిచింది. గ్రాండ్ విటారాకు అత్యధిక ప్రజాదరణ రావడానికి ప్రధాన కారణం దానిలోని స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. ఈ టెక్నాలజీ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు అవసరమైనప్పుడు కారుకు ఎక్స్ ట్రా ఎనర్జీని అందిస్తుంది. బ్యాటరీని స్వయంగా ఛార్జ్ చేసుకుంటుంది. దీనివల్ల కారును ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ కారణంగా ఈ ఎస్‌యూవీ 27.97కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఈ కారు సుమారు 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.