Maruti Suzuki : మారుతి సుజుకి సంచలన నిర్ణయం.. ఇకపై కార్ల కోసం వెయిటింగ్ ఉండదు.
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్ల డిమాండ్‌ను తట్టుకోలేక చేతులెత్తేస్తోంది. బుకింగ్స్ వెల్లువలా వస్తుండటంతో సకాలంలో కార్లను డెలివరీ చేయలేక ఇబ్బంది పడుతోంది. అందుకే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 5 లక్షల యూనిట్ల మేర పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం హర్యానా, గుజరాత్ ప్లాంట్‌ల ద్వారా ఏడాదికి 26 లక్షల కార్లను తయారు చేస్తున్నప్పటికీ, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం తగ్గడం లేదు. జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత దేశీయ మార్కెట్‌లో కార్లకు విపరీతమైన క్రేజ్ పెరగడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీ చెబుతోంది.
ప్రస్తుతం మారుతి సుజుకి వద్ద సుమారు 2 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కంపెనీ తన ప్లాంట్‌లలో 100 శాతం కెపాసిటీతో పనిచేస్తున్నప్పటికీ, మార్కెట్ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది. సాధారణంగా డీలర్‌షిప్‌ల వద్ద 30 రోజుల స్టాక్ ఉండాలి, కానీ ఇప్పుడు కేవలం 12 రోజుల స్టాక్ మాత్రమే ఉంది. ఇందులో కూడా సగం స్టాక్ దారిలోనే (ట్రాన్సిట్) ఉంది. దీనివల్ల కస్టమర్లు తమకు నచ్చిన మోడల్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గత నెలలోనే కంపెనీ బుకింగ్స్ 20 శాతం పెరిగాయి అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ పరిస్థితిపై స్పందిస్తూ.. "మేము ఉత్పత్తి సామర్థ్యం కొరతతో పోరాడుతున్నాము. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా ఎస్‌యూవీ.. ఏ విభాగంలోని కస్టమర్ అయినా ఎక్కువ కాలం నిరీక్షించకుండా ఉండేలా ప్రతి నెలా మా ప్రొడక్షన్ ప్లాన్‌ను అడ్జస్ట్ చేస్తున్నాం" అని తెలిపారు. ముఖ్యంగా యూటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో గత నెలలో ఆ విభాగంలో అమ్మకాలు 12 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం కంపెనీ నెలకు సగటున 2.2 లక్షల నుంచి 2.3 లక్షల కార్లను తయారు చేస్తోంది. ఇందులో 1.8 లక్షల కార్లు భారత్ కోసం, మిగిలిన 50 వేల కార్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు మారుతి సుజుకి తన కొత్త ప్లాంట్‌లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. హర్యానాలోని ఖర్ఖోడా ప్లాంట్‌లో రెండో లైన్ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ప్రారంభం కానుంది. అలాగే గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్ నాలుగో లైన్ రెండో త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు ప్లాంట్‌ల ద్వారా ఏడాదికి అదనంగా 5 లక్షల కార్ల ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఒకవేళ ఉత్పత్తి పెంచకపోతే కస్టమర్లు వేరే కంపెనీల వైపు వెళ్లే ప్రమాదం ఉందని మారుతి ఆందోళన చెందుతోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా స్టాక్ పెంచేందుకు కంపెనీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.