Renault Bridger SUV : రెనాల్ట్ నుంచి మరో ఎస్‌యూవీ.. మారుతి జిమ్నీ, థార్‌లకు ఇక చెమటలే.
Renault Bridger SUV : ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ భారత మార్కెట్లోకి సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది. తన అమ్ముల పొదిలో నుంచి బ్రిడ్జర్ అనే సరికొత్త ఎస్‌యూవీని పరిచయం చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. మార్చి 10, 2026న నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్‌లో ఈ కాన్సెప్ట్ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా భారత్‌లోనే డిజైన్ చేయబడి, ఇక్కడే తయారయ్యే మేడ్ ఇన్ ఇండియా గ్లోబల్ ఎస్‌యూవీ. ఒకప్పుడు భారత రోడ్లపై దుమ్మురేపిన డస్టర్ తర్వాత రెనాల్ట్ నుంచి రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
డిజైన్ విషయానికి వస్తే.. టీజర్ ఆధారంగా బ్రిడ్జర్ ఎస్‌యూవీ చాలా స్ట్రాంగ్ గా, బాక్సీ షేప్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక భాగంలో స్పేర్ వీల్ అమర్చడం వల్ల కారుకు పక్కా ఆఫ్ రోడ్ లుక్ రానుంది. బ్రిడ్జ్ అనే పదం నుంచి స్ఫూర్తి పొంది దీనికి బ్రిడ్జర్ అని పేరు పెట్టారు. ఇది 4-మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే సెగ్మెంట్‌లో రాబోతోంది. అందుకే ఆటోమొబైల్ నిపుణులు దీనిని ముద్దుగా మినీ డస్టర్ అని పిలుస్తున్నారు. పట్టణాల్లో తిరగడానికి అనువుగా ఉంటూనే, గతుకుల రోడ్లపై కూడా సునాయాసంగా దూసుకుపోయేలా దీనిని రూపొందించారు.
ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తే నేరుగా మారుతి సుజుకి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి హేమాహేమీలతో తలపడనుంది. అయితే రెనాల్ట్ దీనిని కొంచెం అర్బన్-ఫ్రెండ్లీగా, అంటే సిటీలో రోజువారీ ప్రయాణాలకు కూడా సౌకర్యంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇది 5-డోర్ లేఅవుట్‌తో రాబోతోందని, మోనోకోక్ ప్లాట్‌ఫారమ్ మీద దీనిని నిర్మిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఆఫ్-రోడింగ్ లవర్స్ కోసం ఇందులో 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బడ్జెట్ ధరలో ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఎదిగింది. అందుకే రెనో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి బ్రిడ్జర్ను ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుతోంది. ముఖ్యంగా బి-సెగ్మెంట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా, మహీంద్రా వంటి స్వదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడమే రెనో లక్ష్యం. మార్చి 10న జరగబోయే futuReady ఈవెంట్‌లో ఈ కారు ఫీచర్లు, ధర, లాంచ్ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.