Maruti Suzuki WagonR : డాక్టర్లు, టీచర్లకు ఇష్టమైన కారు.. జీఎస్టీ కోతతో రూ.80,000వరకు తగ్గింపు.
Maruti Suzuki WagonR : మారుతి సుజుకి వ్యాగన్ఆర్ భారత మార్కెట్‌లో ఎంతో కాలంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. 1999లో తొలిసారిగా విడుదలైన ఈ కారు ఎస్‌యూవీల పోటీ ఉన్నప్పటికీ, ఇప్పటికీ కస్టమర్‌లను ఆకర్షిస్తోంది. తాజాగా, ప్రభుత్వం జీఎస్టీ రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఈ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5 లక్షల కంటే తక్కువకు పడిపోయింది. ఈ ధర తగ్గింపు, ఇప్పుడు రాబోయే పండుగ సీజన్‌లో వ్యాగన్ఆర్ అమ్మకాలు మరింత పెరగడానికి సహాయపడుతుంది.
ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల, మారుతి సుజుకి సంస్థ వ్యాగన్ఆర్ ధరను రూ.80,000 వరకు తగ్గించింది. దీని వల్ల కస్టమర్‌లకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి. వ్యాగన్ఆర్ బేస్ వేరియంట్ (LXi) పైనే అత్యధికంగా రూ.80,000 వరకు తగ్గింపు లభించింది. ఆటోమేటిక్ వేరియంట్ ధరలో కూడా రూ.77,000 వరకు కోత విధించారు. పెట్రోల్‌తో పాటు, పెట్రోల్ ప్లస్ సీఎన్జీ ఆప్షన్‌లో కూడా లభించే వ్యాగన్ఆర్ సీఎన్జీ వేరియంట్ ధర కూడా రూ.80,000 వరకు తగ్గింది.
ధర తగ్గింపుతో పాటు, మారుతి సుజుకి కంపెనీ కస్టమర్‌లను ఆకర్షించడానికి కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. పరిమిత సమయం వరకు, కస్టమర్‌లకు ఫ్లెక్సిబుల్ EMI స్కీమ్, కారు ఫైనాన్స్ చేసుకునే వారి కోసం 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ సదుపాయం కల్పించింది. అంటే, కారు ఫైనాన్స్ చేయించుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీఎస్‌టీ తగ్గక ముందు దీని ధర రూ.5.79 లక్షల నుంచి రూ.7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). జీఎస్‌టీ తగ్గింపు తర్వాత ఈ కారు కొత్త ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. వ్యాగన్ఆర్ కారు తన మైలేజ్ కారణంగానే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.35కిమీ, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 25.19కిమీ, కిలోకు 34.05కిమీ వరకు మైలేజీ వస్తుంది. ఈ మైలేజ్, ధర తగ్గింపుతో వ్యాగన్ఆర్ అమ్మకాలు ఈ పండుగ సీజన్‌లో మరింత పెరగడం ఖాయం.