MINI JCW Countryman : మిని కంట్రీమ్యాన్ వచ్చేసింది.. టాప్ స్పీడ్ గంటకు 250కిమీ.. రేసర్ల కోసం సరికొత్త ఎస్యూవీ.
MINI JCW Countryman : హై స్పీడు, రేసింగ్ పర్ఫార్మెన్స్‌ను కోరుకునే కారు ప్రియుల కోసం మినీ సంస్థ తమ కొత్త ఆల్-వీల్ డ్రైవ్ ఎస్యూవీ అయిన జాన్ కూపర్ వర్క్స్ కంట్రీమ్యాన్ ALL4ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.64.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త ఎస్యూవీ మునుపటి మోడళ్ల కంటే మరింత పెద్దదిగా, విశాలంగా మారింది. ఈ పవర్‌ఫుల్ పెట్రోల్ వేరియంట్ కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ మార్గంలో భారత్‌కు రానుంది.
మినీ కంట్రీమ్యాన్ ప్రత్యేకత దాని 2.0-లీటర్, 4-సిలిండర్ ట్విన్ పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది మినీ రేసింగ్ డీఎన్ఏను కొనసాగిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఇంజిన్ 312 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే ఈ ఎస్యూవీ కేవలం 5.4 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ 250 కి.మీ/గం వరకు ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం వల్ల హైవేలపై అద్భుతమైన స్టెబిలిటీని, టఫ్ రోడ్లపై మెరుగైన గ్రిప్‌ను అందిస్తుంది.
కొత్త జేసీడబ్ల్యూ కంట్రీమ్యాన్ ALL4 డిజైన్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. కొత్త ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేయబడిన జేసీడబ్ల్యూ లోగో, కారు పైకప్పుకు ఇచ్చిన చిల్లీ రెడ్ రంగు అంశాలు దీనికి స్పోర్టీ, బోల్డ్ లుక్‌ను ఇస్తాయి. ఈ మార్పులన్నీ మినీ సాంప్రదాయ కాంపాక్ట్ లుక్‌ను కొనసాగిస్తూనే కారును మరింత అగ్రెసివ్‌గా మార్చాయి.
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. లోపల ఎరుపు, నలుపు రంగుల స్పోర్ట్స్ సీట్లు ఉన్నాయి. డాష్‌బోర్డ్ రీసైకిల్ చేసిన పాలిస్టర్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేశారు. ముఖ్యంగా, ఈ కొత్త మోడల్ సైజులో పెరగడం వల్ల లోపల స్పేస్ కూడా పెరిగింది. లగేజ్ సామర్థ్యం ఏకంగా 1,450 లీటర్ల వరకు అందుబాటులో ఉంది. ఇది రోజువారీ అవసరాలకు, సుదూర ప్రయాణాలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
మినీ ఇండియా ఇప్పటికే కొత్త జేసీడబ్ల్యూ కంట్రీ మ్యాన్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ SUV లో 19, 20-అంగుళాల ఏరోడైనమిక్ వీల్స్, వెడల్పాటి టైర్లను అమర్చారు. దీనివల్ల కారును హ్యాండిల్ చేయడం, నియంత్రించడం మరింత మెరుగుపడుతుంది.