MUSK: మార్స్‌ని దాటినా మస్క్ సంపద

చరిత్ర సృష్టించిన మస్క్... 600 బిలియన్ డాలర్లు దాటినా సంపద... ఒక్కరోజులోనే భారీగా పెరిగిన స్పేస్ ఎక్స్

Update: 2025-12-16 07:30 GMT

దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (x) సంస్థల యజమాని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఆయన నికర సంపద సోమవారం రోజు రికార్డు స్థాయిలో 600 బిలియన్ డాలర్లు దాటింది. మస్క్‌కు మెజారిటీ  వాటా ఉన్న స్పేస్ ఎక్స్.. ఐపీఓకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో దాని విలువ భారీగా పెరగడంతో మస్క్ సంపద కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. స్పేస్ ఎక్స్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 72 లక్షల కోట్ల వరకు) లెక్కగట్టారు. ఇందులో సుమారు 42 శాతం వాటా ఉన్న మస్క్ సంపద దీంతో ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం చూస్తే మస్క్ సంపద డిసెంబర్ 15-16 మధ్య ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 168 బిలియన్ డాలర్లు (రూ. 15.26 లక్షల కోట్లు) పెరిగి.. 677 బిలియన్ డాలర్లకు (రూ. 61 లక్షల కోట్ల వరకు) చేరిందని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తిగా మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఈవీ కార్ మేకర్ టెస్లా షేర్లు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో మస్క్ సంపద విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఇందులో కూడా మస్క్‌కు 12 శాతం వాటా ఉంది.

టెస్లా షేరు ఇప్పుడు సోమవారం సెషన్‌లోనూ 4 శాతం పెరిగి 475.31 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ ధర ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు చూస్తే 25 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో 44 శాతం పుంజుకుంది. మరోవైపు.. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్స్ లేకుండానే ఉండే రోబోటాక్సీల్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు మస్క్ సోమవారం రోజు ప్రకటించడం కూడా టెస్లా షేరు పెరిగేందుకు కారణమైంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ఒక్కరోజులో 167 బిలియన్ డాలర్లు (రూ. 15.16 లక్షల కోట్లు) పెరగ్గా.. 638 బి. డాలర్లుగా ఉందని తెలిసింది. ఇది భారత కరెన్సీలో రూ. 58 లక్షల కోట్లకు సమానం. ఏదేమైనా మొత్తంగా 600 బిలియన్ డాలర్ల సంపద దాటేశారు. స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. సుమారు 30 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమకూర్చాలని చూస్తోంది. ఇది భారత కరెన్సీలో రూ. 2.75 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందు ఈ ఏడాది నవంబరులో మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ. 90 లక్షల కోట్లు) పే ప్యాకేజీకి టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పే ప్యాకేజీ కావడం విశేషం. ఇక్కడ టెస్లా నిర్దేశించిన లక్ష్యాల్ని మస్క్ చేరుకుంటే.. దశల వారీగా ఇది మస్క్‌కు అందుతుంది. దీంతో మస్క్ ట్రిలియనీర్‌గా అవతరిస్తారు.

ప్రపంచంలో అత్యంత సంపన్నుల టాప్ 10 జాబితా 

(డిసెంబర్ 16, 2025 నాటి తాజా అంచనాల ప్రకారం, ఫోర్బ్స్ బ్లూమ్‌బర్గ్ డేటా ఆధారంగా):

1.) ఎలాన్ మస్క్  - సుమారు $638 - $677 బిలియన్స్ 

2.) లారీ పేజ్ - సుమారు $262 - $274 బిలియన్స్ 

3.) లారీ ఎలిసన్  - సుమారు $192 - $260 బిలియన్స్

4.) సెర్గీ బ్రిన్  - సుమారు $250 బిలియన్స్ సమీపంలో 

5.) జెఫ్ బెజోస్  - సుమారు $215 బిలియన్స్

6.) మార్క్ జుకర్‌బర్గ్ - సుమారు $200+ బిలియన్స్

గమనిక: ఈ ర్యాంకింగ్స్ రోజువారీగా మారుతాయి ఎందుకంటే స్టాక్ మార్కెట్, ప్రైవేట్ కంపెనీ వాల్యుయేషన్స్ ప్రభావితం చేస్తాయి. ఇటీవల స్పేస్‌ఎక్స్ వాల్యుయేషన్ భారీగా పెరగడంతో మస్క్ సంపద చరిత్రాత్మకంగా $600 బిలియన్ దాటింది.

Tags:    

Similar News