MUTUAL FUNDS: రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్.. రూ.27వేల కోట్లు దాటిన సిప్ పెట్టుబడులు;
ఇటీవల కాలంలో చాలా మంది మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చిన్న మొత్తాల్లో అయినా పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ నెలనెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తుండటం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిప్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో రికార్డు స్థాయిలో రూ.27,269 కోట్లు మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు వచ్చాయి. సిప్ పెట్టుబడులు రూ.27 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. మే నెలలో సిప్ పెట్టుబడుల మొత్తం రూ.26,668 కోట్లుగా ఉంది. అయితే, గత నెలతో పోలిస్తే మొత్తంగా మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టబడులు 67 శాతం మేర పెరిగాయి. మే నెలలో రూ.29,572 కోట్లు పెట్టుబడులు రాగా.. జూన్‌లో రూ.49,310 కోట్లు ఉన్నట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం వెల్లడించింది.
జూన్ నెలలో భారీగా పెట్టుబడులు
జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో రూ.23,587 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మే నెలలో రూ.19,013 కోట్లుగా ఉంది. ఈఎల్‌ఎస్ఎస్ ఫండ్స్ మినహా అన్ని ఈక్విటీ కేటగిరీల్లోనూ పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.5,733 కోట్లు రాగా.. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,024 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,754 కోట్లు వచ్చాయి. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో జూన్ నెలలో నికరంగా రూ.1,711 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. మే నెలలో ఈ మొత్తం రూ.15,908 కోట్ల ఔట్‌ఫ్లో ఉంది. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్‌లోకి రూ.10,276 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.9,484 కోట్లు వచ్చాయి. లిక్విడ్ ఫండ్స్ నుంచి అత్యధికంగా రూ.25,196 కోట్లు తరలిపోయాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,080 కోట్లు
హైబ్రిడ్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోస్ 12 శాతం మేర పెరిగి రూ.23,222 కోట్లుగా నమోదైనట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం వెల్లడించింది. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.15,584 కోట్లు వచ్చాయి. జూన్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి అత్యధికంగా రూ.2,080 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ 3 శాతం పెరిగి రూ.74.14 లక్షల కోట్లకు చేరింది. మే నెలలో ఈ మొత్తం రూ.71.93 లక్షల కోట్లుగా ఉంది.
పెరిగిన సిప్ ఖాతాలు
సిప్ చేసిన ఖాతాల సంఖ్య మే నెలతో పోలిస్తే జూన్ నెలకు గానూ 8.56 కోట్ల నుంచి 8.64 కోట్లకు పెరిగాయి. సిప్ నిర్వహణలోని ఆస్తుల మొత్తం రూ.15.31 లక్షల కోట్లకు చేరింది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం ఆస్తుల విలువలో సిప్ వాటానే 20.2 శాతం కావడం గమనార్హం. అలాగే మొత్తం సిప్ ఖాతాల సంఖ్య కూడా 9.06 కోట్ల నుంచి 9.19 కోట్లకు పెరిగింది.