New Insurance Bill 2025 : బీమా రంగంలో పెను మార్పులు.. 100% విదేశీ పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్.

Update: 2025-12-16 05:30 GMT

New Insurance Bill 2025 : కేంద్ర మంత్రివర్గం ఇటీవల అందరికీ బీమా, అందరి రక్షణ (బీమా చట్ట సవరణ) బిల్లు, 2025కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో అతిపెద్ద నిర్ణయం ఏమిటంటే.. బీమా కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుంచి 100%కి పెంచడం. దీని అర్థం ఏంటంటే విదేశీ బీమా కంపెనీలు ఇకపై భారతీయ భాగస్వామితో సంబంధం లేకుండా, పూర్తి యాజమాన్యంతో ఇక్కడ వ్యాపారం చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడులు, కొత్త టెక్నాలజీతో భారతదేశంలోకి వస్తాయి. దీనివల్ల మార్కెట్‌లో పోటీ పెరిగి, ప్రీమియంలు తగ్గుతాయి. పాలసీలు సరసమైన ధరలకు లభిస్తాయి. వినియోగదారులకు మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్, ప్రపంచ ప్రమాణాలతో కూడిన కొత్త బీమా ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త బిల్లు పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడానికి రెగ్యులేటర్ అయిన ఐఆర్‌డీఏఐకి మరిన్ని అధికారాలను ఇచ్చింది. సెబీ తరహాలోనే అక్రమంగా లాభాలు ఆర్జించిన కంపెనీల నుంచి ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ఇప్పుడు IRDAIకి ఉంటుంది. అలాగే, బీమా ఏజెంట్లు, మధ్యవర్తులు పదేపదే రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒన్-టైమ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇది పని వేగాన్ని పెంచుతుంది. ఇక దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన LICకి కూడా కొత్త ఊరట లభించింది. ఇకపై కొత్త జోనల్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయడానికి LIC ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు వీలుగా LICకి స్వయంప్రతిపత్తి పెంచారు.

ఈ బిల్లు పెట్టుబడుల విషయంలో విప్లవాత్మకంగా ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన అంశాలలో బీమా రంగాన్ని నిరాశపరిచింది. ఇండస్ట్రీ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కాంపోజిట్ లైసెన్స్ కు ఈ బిల్లులో చోటు దక్కలేదు. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ (జీవిత బీమా), జనరల్ ఇన్సూరెన్స్ (సాధారణ బీమా - హెల్త్, కార్ ఇన్సూరెన్స్) విక్రయించే కంపెనీలు వేరుగా ఉన్నాయి. ఒకే కంపెనీ రెండు రకాల బీమాలు అమ్మేందుకు కాంపోజిట్ లైసెన్స్ అనుమతి ఇస్తుంది. ఇది అమలు అయితే కస్టమర్‌లు ఒకే చోట లైఫ్, హెల్త్, కార్ ఇన్సూరెన్స్‌లను కంబైన్డ్ ప్యాకేజీగా తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఈ మార్పును ప్రస్తుతానికి పక్కన పెట్టింది. అలాగే, కొత్త బీమా కంపెనీల ఏర్పాటుకు ఉన్న కనీస పెట్టుబడి షరతు (రూ.100 కోట్లు) తగ్గించకపోవడం వల్ల, చిన్న, ప్రాంతీయ స్థాయి కంపెనీలు మార్కెట్‌లోకి రావడం కష్టంగానే ఉంటుంది.

Tags:    

Similar News