Tata Nexon : భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి. అమ్మకాల పరంగా ఈ కారు ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 2017 లో భారతదేశంలో మొదటిసారిగా లాంచ్ అయిన నెక్సాన్, టాటా మోటార్స్ నుంచి వచ్చిన మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇదే. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే ఇది భారత మార్కెట్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. భారత మార్కెట్లో దీనికి మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా 3XO వంటి కార్లు గట్టి పోటీని ఇస్తున్నాయి.
టాటా నెక్సాన్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది భారతదేశంలో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ అనే నాలుగు రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లలో లభిస్తున్న ఏకైక కారు. ఈ అద్భుతమైన ఫీచర్ మహీంద్రా, హ్యుందాయ్ వంటి ఇతర కార్ల తయారీదారుల మోడళ్లలో కూడా లేదు. నాలుగు పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉండడం వల్ల, నెక్సాన్ కారు వినియోగదారులకు వారి అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఎంచుకునే వెసులుబాటును అందిస్తోంది.
టాటా నెక్సాన్ పెట్రోల్: నెక్సాన్ పెట్రోల్ మొత్తం 21 మోడళ్లలో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.7.32 లక్షల నుంచి రూ.13.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ రెవొట్రాన్ పెట్రోల్ ఇంజన్ (1199 cc) ఉంటుంది. ఇది 118 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ మాన్యువల్, ఆటోమేటిక్ మోడల్స్‌ను బట్టి లీటరుకు 17.01 కిమీ నుంచి 17.44కిమీ వరకు ఉంటుంది.
టాటా నెక్సాన్ డీజిల్: డీజిల్ మోడల్ 18 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.14.05 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ (1497 cc) ఉంటుంది. దీని మైలేజ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లీటరుకు 23.23 కిమీ వరకు, ఆటోమేటిక్ (AMT) వేరియంట్‌లో లీటరుకు 24.08 కిమీ వరకు ఉంటుంది.
టాటా నెక్సాన్ CNG: సీఎన్జీ ఆప్షన్ 10 మోడళ్లలో లభిస్తోంది. దీని ధర రూ.8.23 లక్షల నుంచి రూ.13.26 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇందులో కూడా 1199 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5000 rpm వద్ద 99 bhp పవర్, 2000-3000 rpm వద్ద 170 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని మైలేజ్ కిలోకు 17.44 కిమీగా ఉంది, హైవేపై సుమారు కిలోకు 18-19 కిమీ వరకు చేరవచ్చు.
టాటా నెక్సాన్ EV : నెక్సాన్ ఈవీ ప్రధానంగా నెక్సాన్ ఈవీ, నెక్సాన్ EV మ్యాక్స్ అనే రెండు మోడళ్లలో లభిస్తుంది. నెక్సాన్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంటుంది. దీని 45 kWh బ్యాటరీ వేరియంట్ ARAI ప్రకారం 489 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది, అయితే రియల్ రేంజ్ 350-370 కి.మీ వరకు ఉంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ.16.49 లక్షల నుంచి రూ.20.04 లక్షల వరకు ఉంటుంది.