Nissan : రూ. 5.75 లక్షలకే 7 సీటర్.. నిస్సాన్ నుంచి కొత్త ఎంపీవీ..పిచ్చెక్కించే ఫీచర్లు

Update: 2025-10-23 13:15 GMT

Nissan : నిస్సాన్ భారత్‌లో మాగ్నైట్ కారును విడుదల చేసి దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఇప్పుడు కంపెనీ మార్కెట్‌లో కొత్త హై-వాల్యూమ్ మోడల్‌లను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా నిస్సాన్ త్వరలో చిన్న ఎంపీవీని విడుదల చేయనుంది, దీనిని తాజాగా తొలిసారిగా రోడ్ టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఈ రాబోయే నిస్సాన్ ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్ రీ-బ్యాడ్జ్డ్ వెర్షన్గా ఉండనుంది. ఇది దాదాపు ట్రైబర్ బాడీ, హెడ్‌ల్యాంప్‌లు, ఎస్‌యూవీ తరహా వీల్ ఆర్చ్ క్లాడింగ్‌తో కనిపిస్తోంది.

టెస్టింగ్ సమయంలో కనిపించిన నిస్సాన్ ఎంపీవీ, రెనాల్ట్ ట్రైబర్‌తో చాలా పోలికలు కలిగి ఉంది. కొత్త ఎంపీవీ బాడీ, హెడ్‌ల్యాంప్‌లు, ఎస్‌యూవీ తరహా వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటి అంశాలు ట్రైబర్‌ను పోలి ఉన్నాయి. అయితే, నిస్సాన్ తన కొత్త ఎంపీవీకి ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వడానికి కొన్ని మార్పులు చేసింది. ముందు భాగంలో కొత్త రేడియేటర్ గ్రిల్, బంపర్, దిగువ ఎయిర్ ఇన్‌టేక్ డిజైన్‌ను నిస్సాన్ మార్చే అవకాశం ఉంది. సైడ్ భాగంలో 14-అంగుళాల వీల్స్‎కు కొత్త డిజైన్, వెనుక భాగంలో బంపర్, టెయిల్ ల్యాంప్‌ల గ్రాఫిక్స్‌లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్ ఎంపీవీ ఇంటీరియర్ రెనాల్ట్ ట్రైబర్ మాదిరిగానే ఉండనుంది. అప్‌హోల్‌స్టరీ, డెకార్ ఎలిమెంట్స్, కలర్ స్కీమ్‌ల వంటి ప్రాథమిక అంశాలలో ట్రైబర్‌లాగే ఉంటుంది. ఈ కారులో ఏడు సీట్లు ఉంటాయి. బూట్ స్పేస్‌ను పెంచడానికి వీలుగా, మూడవ వరుసలో రెండు రిమూవబుల్ సీట్లు ఉంటాయి. రెండవ వరుస సీట్లలో స్లైడింగ్, రిక్లైనింగ్, ఫోల్డ్ ఫంక్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్ ఈ రాబోయే ఎంపీవీని ఆధునిక ఫీచర్లతో నింపాలని చూస్తోంది. ఈ కొత్త మోడల్ నిస్సాన్‌కు డాట్సన్ గో+ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌వీఎంలు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

సేఫ్టీ విషయంలో ఈ కారులో స్టాండర్డ్ ఫీచర్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. అలాగే, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా, టీసీఎస్, హెచ్‌ఎస్‌ఏ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఎంపీవీలో 71 హెచ్‌పీ, 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభించవచ్చు. నిస్సాన్ ఈ కొత్త ఎంపీవీని ఫిబ్రవరి 2026లో మార్కెట్‌లోకి విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.75 లక్షల వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News