Ola Electric : కుప్పకూలిన ఓలా సామ్రాజ్యం..టీవీఎస్, బజాజ్ మెరుపు దాడితో నేరుగా ఐదో స్థానానికి పతనం.

Update: 2025-12-20 09:15 GMT

Ola Electric : ఒకప్పుడు దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 2024 వరకు తిరుగులేని నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ కంపెనీకి 2025 సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదు. ఒకానొక దశలో మార్కెట్‌లో 45 శాతం వాటాను కలిగి ఉన్న ఓలా, ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయి వెనుకబడిన కంపెనీగా మారిపోయింది. తాజా గణాంకాల ప్రకారం నవంబర్ 2025లో ఓలా కేవలం 8,400 స్కూటర్లను మాత్రమే విక్రయించగలిగింది. గతేడాది ఇదే సమయానికి 30 వేలకు పైగా స్కూటర్లు అమ్మిన కంపెనీకి ఇది భారీ ఎదురుదెబ్బ.

ఓలా పతనానికి ప్రధాన కారణం సర్వీస్ ఇబ్బందులు, నాణ్యత లోపాలేనని నిపుణులు చెబుతున్నారు. నెలకు దాదాపు 80,000 వినియోగదారుల ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు గోవా వంటి రాష్ట్రాల్లో సర్వీస్ సెంటర్లలో వేల సంఖ్యలో స్కూటర్లు పేరుకుపోవడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా అమ్మకాలపై నిషేధం విధించింది. ఇటు కస్టమర్ల అసహనం, అటు రెగ్యులేటరీ సంస్థల విచారణలతో ఓలా బ్రాండ్ విలువ వేగంగా పడిపోయింది. దీని ప్రభావం కంపెనీ షేర్ వాల్యూ మీద కూడా పడింది. ఐపీఓ ధర కంటే చాలా తక్కువకు షేర్లు ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి.

ఓలా వెనకబడిపోతుంటే దశాబ్దాల అనుభవం ఉన్న టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజాలు మార్కెట్‌ను ఆక్రమించాయి. నవంబర్ 2025 నాటికి టీవీఎస్ మోటార్ 26.8% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఐక్యూబ్ స్కూటర్ల నమ్మకమే ఈ విజయాన్ని అందించింది. అటు బజాజ్ ఆటో 22.6% వాటాతో రెండో స్థానంలో ఉంటే, స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ 18.7% వాటాతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. హీరో మోటోకార్ప్ కూడా తన విడా బ్రాండ్‌తో ఓలా కంటే ముందు వరుసలో నిలబడింది.

ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రమోటర్ వాటాలను అమ్మడం కూడా మార్కెట్‌లో నెగటివ్ సెంటిమెంట్‌ను పెంచింది. కేవలం అమ్మకాలే కాదు, కంపెనీ ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తోంది. వరుసగా త్రైమాసిక నష్టాలను నమోదు చేస్తూ, ఆదాయంలో 43% మేర తగ్గుదలని చూసింది. ఒకప్పుడు 50 శాతం మార్కెట్ మనదే అన్న స్థాయి నుంచి ఇప్పుడు 7 శాతానికి పడిపోవడం అంటే అది ఓలాకు ఒక మేల్కొలుపు లాంటిదే. పాత తరం కంపెనీలైన టీవీఎస్, బజాజ్ ఇచ్చే సర్వీస్, భరోసా ముందు ఓలా తలవంచక తప్పలేదు.

Tags:    

Similar News