ChatGPT: దివాలా దిశగా ఓపెన్‌ఏఐ
చాట్ జీపీటీ నిర్వహణకే రోజుకు ఏడు లక్షల డాలర్లు ఖర్చు;
చాట్‌జీపీటీని రూపొందించి పేరు సంపాదించుకుంది ఓపెన్AI సంస్థ. కానీ ఇప్పుడు అది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024 చివరి నాటికి ఇది దివాళా తీసే అవకాశం ఉందన్న భయాందోళనలు నెలకొన్నాయి. చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య ప్రారంభంలో రికార్డు స్థాయిలో పెరిగి తర్వాత క్రమంగా తగ్గుతూ ఉండటం, దీనిపై రోజుకు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం ఆ సంస్థను అంతకంతకూ నష్టాల ఊబిలోకి తీసుకెళ్తోంది.
చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్AI...... 2024 చివరినాటికి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాలా తీసే అవకాశం ఉన్నట్లు అనలటిక్స్ ఇండియా మ్యాగజైన్ కథనం పేర్కొంది. చాట్‌జీపీటీని నడిపేందుకు ఓపెన్AI సంస్థకు రోజుకు 5 కోట్ల 80 లక్షల రూపాయల ఖర్చు అవుతోంది. జీపీటీ 3.5, జీపీటీ 4 రూపంలో వినియోగదారులను ఆకర్షించే యత్నం చేసినా బ్రేక్‌ఈవెన్ సాధించడానికి అవసరమైన ఆదాయం ఓపెన్AIకు సమకూరడం లేదు. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ఆరంభించినప్పుడు అత్యధిక వృద్ధి సాధించిన యాప్‌గా అది రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో యూజర్లు వచ్చి చేరారు. ఐతే గత కొన్ని నెలలుగా చాట్‌జీపీటీని వినియోగించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. జూలై చివరి నాటికి ఆ సంఖ్య మరింత దిగజారింది. సిమిలర్‌వెబ్ డేటా ప్రకారం జూన్‌లో 170 కోట్లుగా ఉన్న చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య జులైలో 150 కోట్లకు పడిపోయింది. చాలా కంపెనీలు చాట్‌జీపీటీని వినియోగించరాదని తమ ఉద్యోగులకు సూచించాయి. కొన్ని కంపెనీలు సొంతంగా AI చాట్‌బాట్లను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఓపెన్‌ఏఐ లాభాలు ఆర్జించలేకపోయింది.
చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడం మొదలు పెట్టినప్పుడు ఓపెన్AI నష్టాలు రెట్టింపై 540 మిలియన్ డాలర్లకు చేరాయి. మైక్రోసాఫ్ట్ పెట్టిన 10 బిలియన్ డాలర్ల పెట్టుబడే ఇంకా ఆ సంస్థ మనుగడ సాగించేలా చేస్తోంది. మరోవైపు 2023లో 200 మిలియన్ డాలర్ల ఆదాయం, 2024లో 1 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని ఓపెన్AI అంచనా వేస్తోంది. నష్టాలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఓపెన్AI ఏ మేరకు మనుగడ సాధించగలదో వేచి చూడాల్సి ఉంది.