RBI: మీ దగ్గర రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా..?
రూ.2,000 నోట్లలో ₹6,181 కోట్లు తిరిగి రాలేదు: RBI;
జర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2023 మే 19న మార్కెట్ నుంచి రూ.2,000 విలువ గల నోట్లను ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం తీసుకొని ఏడాది గడుస్తున్నా.. ఆ నోట్లన్నీ పూర్తిగా తిరిగి రాలేదని ఆర్బీఐ తాజాగా పేర్కొంది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 మే 31 నాటికి ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ప్రజల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బ్యాంకులకు తిరిగి రాలేదని, కానీ మొత్తంగా జారీ చేసిన నోట్లలో 98.26 శాతం నోట్లు మాత్రం తిరిగి తమ వద్దకు వచ్చాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఉపసంహరణ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది?
2023 మే 19న ఆర్బీఐ రూ.2,000 నోట్లను పద్దతిగా చలామణి నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆ నాటికి ఆ నోట్లు చలామణిలో ఉన్న మొత్తం విలువ సుమారు ₹3.56 లక్షల కోట్లు. ప్రజలు, వ్యాపారులు ఆ నోట్లను అక్టోబర్ 7, 2023 వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి లేదా మార్చుకోవడానికి అవకాశం కల్పించారు.
తర్వాత పరిస్థితి ఏమిటి?
అక్టోబర్ 9, 2023 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. వ్యక్తులు లేదా సంస్థలు తమ పేర్లపై నోట్లను ఆర్బీఐకి పంపించి ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పోస్టాఫీసుల ద్వారా డిపాజిట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆర్థిక ప్రభావం ఎలా ఉంటుంది?
ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ నోట్లను తొలగించడం వల్ల పెద్దగా ద్రవ్యోల్బణ ప్రభావం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్దనోట్లను మార్కెట్ నుంచి తీసేసి, చిన్న నోట్ల వినియోగాన్ని పెంపొందించడమే ఆర్బీఐ ఉద్దేశమని విశ్లేషణలు చెబుతున్నాయి. అలాగే, నగదు ఆధారిత చెలామణిని తగ్గించడంలో ఇది భాగంగా చూస్తున్నారు.
ముందు నోట్ల రద్దు – ఇప్పుడు ఉపసంహరణ
2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నోట్ల రద్దును చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ₹500, ₹1,000 నోట్లను రద్దు చేశారు. అదే సమయంలో అత్యవసర అవసరాల నిమిత్తం ప్రవేశపెట్టిన రూ.2,000 నోట్లు ఇప్పుడు అవసరం లేకపోవడంతో ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మీ దగ్గర రూ. 2000 నోట్లు ఉంటే వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ఆర్భీఐ తెలిపింది. రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు పేర్కొంది. రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 మే 2023న చలామణి నుండి ఉపసంహరించుకుంది.