RBI : ఆర్బీఐ కొత్త ప్రయత్నం.. మీరు మరచిపోయిన అకౌంట్ డబ్బును ఇలా తిరిగి పొందవచ్చు.
RBI : చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండి, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించకుండా వదిలేస్తారు. మీ బ్యాంకు ఖాతా రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది డియాక్టివేట్ అవుతుంది. ఆ ఖాతాలో ఉన్న డబ్బును తిరిగి తీసుకోవడం కష్టం లేదా అసాధ్యమని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆ డబ్బును చాలా ఈజీగా, వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. ఇందుకోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.
డియాక్టివేట్ అయిన అకౌంట్ల నుంచి డబ్బును ప్రజలు తిరిగి పొందేందుకు వీలుగా, ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఒక స్పెషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 మధ్య దేశంలోని ప్రతి జిల్లాలో క్లెయిమ్ చేయని ఆస్తుల క్యాంపులు నిర్వహిస్తుంది. ఈ క్యాంపులలో ప్రజలు తమ పాత, డియాక్టివేట్ అయిన ఖాతాల డబ్బును తిరిగి పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు మీ బ్యాంకు ఖాతాను 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగించకపోతే, అది డియాక్టివేట్ అవుతుంది. ఒకవేళ 10 సంవత్సరాల పాటు ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగకపోతే, బ్యాంక్ ఆ డబ్బును ఆర్బీఐ డీఈఏ ఫండ్కు బదిలీ చేస్తుంది. 24 మే 2014న ఈ ఫండ్‌ను ఇలాంటి డబ్బు రికార్డులను భద్రంగా ఉంచడానికి స్థాపించారు. అయితే, ఆ డబ్బు డీఈఏ ఫండ్‌కు వెళ్లినా, ఖాతాదారుడు లేదా అతని చట్టపరమైన వారసులు ఎప్పుడైనా ఆ డబ్బును తిరిగి క్లెయిమ్ చేయవచ్చు.
డబ్బు తిరిగి పొందేందుకు సులభమైన పద్ధతులు
మీరు మీ పాత, నిష్క్రియం అయిన ఖాతాలో డబ్బును తిరిగి పొందాలంటే, ఈ ఈజీ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఇది మీ పాత అకౌంట్ ఉన్న బ్రాంచే కానవసరం లేదు. ఆ బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచికైనా వెళ్లవచ్చు. అక్కడ ఒక దరఖాస్తు ఫారం నింపి, మీ కేవైసీ డాక్యుమెంట్లను (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి) యాడ్ చేయాలి. బ్యాంక్ మీ డాక్యుమెంట్లను పరిశీలిస్తుంది. అది పూర్తయిన తర్వాత, మీ డబ్బు వడ్డీతో సహా మీ ప్రస్తుత బ్యాంకు ఖాతాకు తిరిగి జమ అవుతుంది.
మీరు నేరుగా బ్యాంక్‌కు వెళ్లడంతో పాటు, ఆర్బీఐ నిర్వహించే క్లెయిమ్ చేయని ఆస్తుల క్యాంపుల(అక్టోబర్-డిసెంబర్ 2025)కు కూడా వెళ్లవచ్చు. ఈ క్యాంపుల్లో బ్యాంక్ అధికారులు ఉంటారు. వారు మీకు డబ్బు క్లెయిమ్ చేసే ప్రక్రియలో సహాయం చేస్తారు. ఆ ప్రక్రియను అక్కడే పూర్తి చేయవచ్చు. ఈ చొరవ వల్ల మర్చిపోయిన డబ్బును తిరిగి పొందాలనుకునే వారికి చాలా సులువు అవుతుంది.