RBI: త్వరలోనే కొత్త రూ.10, 500 నోట్లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు;
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఆర్‌బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ.10, రూ.500 నోట్లు త్వరలో జారీ చేయనున్నారు. మహాత్మ గాంధీ సిరీస్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లూ ఉండబోతున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లను జారీ చేసినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ గతంలో జారీ చేసిన రూ.10, రూ.500 డినామినేషన్లలోని అన్ని (పాత) నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. గవర్నర్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.100, రూ.200 నోట్లను కూడా విడుదల చేస్తున్నట్లు ఆర్‌బీఐ గత నెలలో ప్రకటించింది.
కొత్త గవర్నర్‌గా మల్హోత్రా
2024 డిసెంబర్‌లో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆరేళ్ల పాటు పదవిలో ఉన్న శక్తికాంత దాస్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. కొత్త గవర్నర్ చేరుకున్న వెంటనే కొత్త సంతకాలతో నోట్లు విడుదల చేస్తుంటారు. కానీ దీని వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాత నోట్ల విలువ మారదు. ఇప్పటివరకు ఉన్న రూ.500 నోట్లు బూడిద (స్టోన్ గ్రే) రంగులో ఉన్నాయి. అయితే కొత్త నోట్లలో రంగు, పరిమాణం, డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త రూ.500 నోట్ల పరిమాణం 66mm x 150mmగా నిర్ణయించినట్టు సమాచారం.