Rupee : భారత రూపాయికి అంతర్జాతీయ గుర్తింపు.. చైనా యువాన్, అమెరికన్ డాలర్‌కు సవాల్.
Rupee : భారత రూపాయికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముఖ్యమైన అడుగు వేశాయి. ముఖ్యంగా పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంకలలోని బ్యాంకులకు, అక్కడి వ్యక్తులకు ఇకపై భారతీయ బ్యాంకులే నేరుగా రూపాయిలలో లోన్లు ఇవ్వనున్నాయి. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చడంలో, చైనీస్ యువాన్, అమెరికన్ డాలర్‌ల ఆధిపత్యాన్ని తగ్గించడంలో ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదిగా పరిగణించబడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకూ ఈ సదుపాయం విస్తరించే అవకాశం ఉంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం.. భారతీయ బ్యాంకులు, వాటి విదేశీ శాఖలు ఇకపై భూటాన్, నేపాల్, శ్రీలంకలలోని వ్యక్తులకు, బ్యాంకులకు భారతీయ రూపాయిలలో రుణాలు ఇవ్వవచ్చు. సరిహద్దు వాణిజ్యం, చెల్లింపులను సులభతరం చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశం. ఈ మూడు పొరుగు దేశాలతో భారతీయ రూపాయిలో వాణిజ్య లావాదేవీల ఒప్పందాలు మరింత బలోపేతం అవుతాయని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.
అక్టోబర్ 1, 2025న జరిగిన ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రూపాయి అంతర్జాతీయీకరణ కోసం పలు సంస్కరణలను ప్రకటించారు. సరిహద్దు లావాదేవీల్లో రూపాయి వినియోగాన్ని పెంచేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూపాయిని గ్లోబల్ ట్రేడ్, ఫైనాన్స్ మరియు పెట్టుబడుల కోసం విస్తృతంగా ఆమోదయోగ్యంగా మార్చడానికి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కృషి చేస్తోంది.
రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చడానికి ఆర్‌బీఐ మూడు ప్రధాన చర్యలను ప్రతిపాదించింది. పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంకల నివాసితులకు భారతీయ రూపాయిల్లో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వడం. అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడే కీలక దేశాల కరెన్సీలకు పారదర్శకమైన రెఫరెన్స్ రేట్లను ఏర్పాటు చేయడం. దీని ద్వారా ధరల అంచనా సులభమవుతుంది. ఇండోనేషియా రూపాయి, యూఏఈ దిర్హామ్ వంటి కరెన్సీల కోసం వీటిని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తోంది. ప్రత్యేక రూపాయి వాస్ట్రో ఖాతాలలో మిగిలిన నిధులను ఇప్పుడు కార్పొరేట్ బాండ్లు, కమర్షియల్ పేపర్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఇవ్వడం.
ఇంతకుముందు, భారతీయ ఎగుమతిదారులు విదేశాలలో ఏదైనా బ్యాంకులో విదేశీ కరెన్సీ ఖాతాలను తెరిచి, తమ ఎగుమతి రాబడులను అందుకోవడానికి జనవరి 2025లో ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఈ ఖాతాలలో మిగిలిపోయిన వినియోగించని మొత్తాన్ని తదుపరి నెల చివరిలోగా తిరిగి భారత్‌కు పంపాల్సి ఉండేది. ఇప్పుడు ఆర్‌బీఐ ఈ గడువును మూడు నెలలకు పొడిగించింది.