Renault Duster 2026: క్రెటా, సెల్టోస్ పని ఖతం.. 26న రెనాల్ట్ డస్టర్ విధ్వంసం.
Renault Duster 2026: భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఎస్‌యూవీ అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ తన పాత వైభవాన్ని వెతుక్కుంటూ వస్తోంది. మూడవ తరం సరికొత్త డస్టర్‌ను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే జనవరి 26, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. పాత మోడల్ కంటే ఇది మరింత శక్తివంతంగా, స్టైలిష్‌గా కనిపిస్తూ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
ఈ కొత్త డస్టర్ డిజైన్ విషయంలో రెనో చాలా జాగ్రత్తలు తీసుకుంది. దీనికి ఉన్న Y షేప్ హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు కారుకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తున్నాయి. స్పోర్టీ బంపర్లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంకా కారు చుట్టూ ఉన్న బాడీ క్లాడింగ్ దీనికి అసలైన ఆఫ్‌రోడర్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. కారు లోపల కూడా డ్రైవర్‌కు సౌకర్యంగా ఉండేలా కేబిన్‌ను డిజైన్ చేశారు. ఇందులో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, సేఫ్టీ కోసం లెవల్ 2 ADAS వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండబోతున్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ప్రారంభంలో ఈ కారు కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.3 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండూ వస్తాయి. మైలేజీని ఎక్కువగా కోరుకునే వారి కోసం 'ఫుల్ హైబ్రిడ్' వెర్షన్‌ను కొంచెం ఆలస్యంగా మార్కెట్లోకి తీసుకురావాలని రెనో భావిస్తోంది. గతంలో డస్టర్‌ను అమితంగా ప్రేమించిన వారికి ఈ కొత్త మోడల్ ఒక తీపి కబురు అనే చెప్పాలి.
మార్కెట్లోకి రాగానే ఈ కారుకు పోటీ కూడా గట్టిగానే ఉండనుంది. ఇప్పటికే సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న క్రెటాతో పాటు టాటా సియెర్రా, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్ల మధ్య ఈ కొత్త డస్టర్ తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందో చూడాలి. పాత డస్టర్ తన మన్నికకు, సస్పెన్షన్ కంఫర్ట్‌కు పేరుగాంచింది. అదే మ్యాజిక్‌ను కొత్త మోడల్ కూడా చూపిస్తే మాత్రం రెనోకు ఇండియాలో మళ్ళీ మంచి రోజులు మొదలైనట్టే.