Renault Duster : పాత డస్టర్‌కు పూర్తి భిన్నంగా కొత్త రెనాల్ట్ డస్టర్... అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రీ-ఎంట్రీ!
Renault Duster : ఒకప్పుడు భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్.. సరికొత్త రూపంలో తిరిగి రాబోతోంది. కొత్త తరం డస్టర్ 2026 జనవరి 26న భారతదేశంలో లాంచ్ కానుండగా ఇది పాత మోడల్ డస్టర్ కంటే డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా చాలా భిన్నంగా, మరింత మోడ్రన్‌గా ఉంది. విదేశాల్లో ఇప్పటికే అమ్ముడవుతున్న ఈ కొత్త డస్టర్ లుక్ మరింత బోల్డ్‌గా, షార్ప్‌గా మారింది. మరి పాత డస్టర్‌కి, కొత్త డస్టర్‌కి డిజైన్ పరంగా ఉన్న తేడాలు ఏంటి? లోపల ఎలాంటి మార్పులు జరిగాయి? అనే వివరాలు తెలుసుకుందాం.
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (డస్టర్ 3.0) పాత మోడల్ కంటే చాలా బోల్డ్‌గా, ఫ్లాట్‌గా, మరింత మోడ్రన్ లుక్ సంతరించుకుంది. పాత డస్టర్‌లో ఉన్న గుండ్రని హెడ్‌లైట్లకు బదులుగా, కొత్త మోడల్‌లో స్టైలిష్‌గా ఉండే Y-ఆకారపు ఎల్‌ఈడీ లైట్లు ఇవ్వబడ్డాయి. ఫ్రంట్ బంపర్ డిజైన్ మరింత పవర్‌ఫుల్‌గా, ఉబ్బెత్తుగా ఉంది. కింది భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కంపెనీ లోగో, పేరు రాసే విధానంలో కూడా మార్పులు జరిగాయి.
సైడ్ నుంచి చూసినప్పుడు ఈ ఎస్‌యూవీ మరింత షార్ప్‌గా, క్లియర్ లైన్లతో కనిపిస్తుంది. ఇందులో మందపాటి బాడీ క్లాడింగ్, చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చ్‌లు ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన మార్పులలో ఒకటి వెనుక డోర్ హ్యాండిల్. ఇది పాత మోడల్‌లో మాదిరిగా డోర్‌పై కాకుండా, సి-పిల్లర్లో హైడ్ చేసి ఉంచారు. కొత్త డస్టర్ వెనుక భాగంలో కూడా డిజైన్ పరంగా చాలా పెద్ద మార్పులు చేశారు.. అవి ముందు భాగంలోని లైట్లకు అనుగుణంగా ఉన్నాయి. వెనుక వైపు రివర్స్ Y ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ టైల్‌లైట్లు ఇచ్చారు. ఇవి ముందు ఉన్న హెడ్‌లైట్ డిజైన్‌ను పోలి ఉంటాయి.
DUSTER పేరును ఎస్‌యూవీ వెడల్పు అంతా విస్తరించి రాశారు. దీనివల్ల కారుకు మరింత గంభీరమైన లుక్ వచ్చింది. కొత్త డస్టర్ ఇంటీరియర్ పూర్తిగా కొత్తగా, పాత మోడల్‌తో పోలిస్తే మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంది. మధ్యలో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వబడింది. పాత డస్టర్‌లో ఉన్న సాధారణ అనలాగ్ మీటర్లకు బదులుగా, కొత్త మోడల్‌లో సమాచారాన్ని లేటెస్ట్ పద్ధతిలో చూపించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. స్టీరింగ్ వీల్ డిజైన్ కొత్తగా, ఫ్లాట్-బాటమ్ స్టైల్‌లో స్పోర్టీ లుక్ ఇస్తుంది. ఏసీ వెంట్ల డిజైన్ కూడా మారిపోయింది. మొత్తంగా, కొత్త రెనాల్ట్ డస్టర్ మరింత అడ్వాన్సుడ్, స్టైలిష్, ఫీచర్-రిచ్ ఎస్‌యూవీగా భారత మార్కెట్‌లోకి రాబోతోంది.