Robert Kiyosaki : మార్కెట్‌లో అతిపెద్ద కుదుపు.. కరెన్సీకి విలువ ఉండదు, బంగారం, బిట్‌కాయిన్‌లకు మాత్రమే భవిష్యత్తు.
Robert Kiyosaki : ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మార్కెట్ కుదుపు రాబోతుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చాలా సంవత్సరాలుగా భయానక అంచనాలను చెబుతూనే ఉన్నారు. తాజాగా 78 ఏళ్ల కియోసాకి మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆయన అంచనా ప్రకారం ఈ భారీ మార్కెట్ పతనం ఈ ఏడాదే సంభవించనుందట. ఈ నేపథ్యంలో ఆయన తన ఎక్స్ అకౌంట్ ద్వారా కీలక ఆర్థిక సలహాలను పంచుకున్నారు.
రాబర్ట్ కియోసాకి ఇటీవల తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ.. ఈ ఏడాది భారీ మార్కెట్ పతనం తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా, 1946 నుంచి 1964 మధ్య జన్మించిన బేబీ బూమర్‌ల రిటైర్మెంట్ డబ్బు అంతా ఖాళీ అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరెన్సీ రూపంలో సేవింగ్స్ చేసుకున్న ఈ డబ్బు విలువ గణనీయంగా తగ్గిపోవచ్చని కియోసాకి అభిప్రాయం. పొదుపు చేసేవారు నష్టపోతారు అని తాను చాలా కాలంగా చెబుతున్నానని ఆయన తన పోస్ట్‌లో గుర్తు చేశారు.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కరెన్సీ నోట్లను దగ్గర ఉంచుకోవద్దని రాబర్ట్ కియోసాకి చాలా కాలంగా చెబుతున్నారు. బదులుగా, ఆయన రియల్ ఎస్టేట్‌లో, ముఖ్యంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇటీవల ఎథీరియం వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని పదేపదే సలహా ఇస్తున్నారు. కియోసాకి ప్రకారం.. భవిష్యత్తులో కరెన్సీ తన విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే స్థిరమైన విలువ ఉన్న ఆస్తులను కొనుగోలు చేయాలి.
వెండి, ఎథీరియం బెస్ట్ అని కియోసాకి పేర్కొన్నారు. ఈ రెండింటికి నిల్వ విలువ ఉండటంతో పాటు, వాటి ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. అంతేకాక, ఈ ఆస్తులు పరిశ్రమలలో కూడా ఉపయోగపడుతాయి. పెట్టుబడిదారులు, ఈ ఆస్తుల గురించి అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలను విని, సొంత తెలివితో నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.