Royal Enfield Classic 350 : జీఎస్టీ తగ్గగానే క్లాసిక్ 350 పై పడ్డారు.. బుల్లెట్, హంటర్‌లను దాటేసి నంబర్ 1గా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్.
Royal Enfield Classic 350 : భారత మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల జోరు కొనసాగుతోంది. ఇటీవల జీఎస్టీ కోత కారణంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ క్లాసిక్ బ్రాండ్ సెప్టెంబర్ 2025 నెలలో అద్భుతమైన అమ్మకాల ప్రదర్శనను కనబరిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 43.17% వృద్ధిని నమోదు చేసింది. ఈ అమ్మకాల విజయంలో, సంస్థ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ క్లాసిక్ 350 బుల్లెట్, హంటర్ వంటి మోడళ్లను సైతం వెనక్కి నెట్టి నంబర్-1 స్థానంలో నిలిచింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్ రేంజ్‌లో ఇటీవల ధరల కోత విధించిన తర్వాత అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ 440సీసీ, 450సీసీ, 650సీసీ మోడల్స్‌లో కాస్త భిన్నమైన ధోరణి కనిపించినా, 350సీసీ విభాగం మొత్తం అమ్మకాలకు బలాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 1,13,573 యూనిట్ల విక్రయాలు జరిపింది. ఇది సెప్టెంబర్ 2024 (79,326 యూనిట్లు) తో పోలిస్తే 43.17% అద్భుతమైన వార్షిక వృద్ధి.
కంపెనీ అమ్మకాలలో అగ్రస్థానం క్లాసిక్ 350దే. ఈ ఒక్క మోడలే మొత్తం అమ్మకాలలో సింహభాగాన్ని ఆక్రమించింది. క్లాసిక్ 350 ఏకంగా 40,449 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 22.33% వృద్ధి. కంపెనీ మొత్తం అమ్మకాలలో క్లాసిక్ 350 వాటా 35.61% గా ఉంది. క్లాసిక్ 350 తర్వాత బుల్లెట్ 350 రెండవ స్థానంలో నిలిచింది. ఇది 25,915 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 100.88% భారీ వృద్ధిని నమోదు చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది జే-ప్లాట్‌ఫామ్ పై నిర్మించిన రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్. పాత తరం రూపాన్ని ఆధునిక ఫీచర్లతో కలిపి అందిస్తుంది. దీని పాత ఆకర్షణీయమైన డిజైన్, సులువుగా గుర్తుపట్టగలిగే ఇంజిన్ సౌండ్, రోడ్డుపై పటిష్టమైన రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఇది భారతీయ మార్కెట్‌లో అత్యంత ఇష్టమైన మోడల్‌గా నిలిచింది.
ఈ బైక్ భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రశంసలు అందుకుంది. 2025 సంవత్సరంలో కూడా క్లాసిక్ 350 నంబర్-వన్ సెల్లింగ్ మోడల్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. గత కొన్నేళ్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ నుండి 650సీసీ వరకు తమ మోడళ్లను వేగంగా విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ అత్యంత సరసమైన బైక్ హంటర్ 350, దీని ధర రూ.1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. అయితే, సుమారు రూ.1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర ఉన్న క్లాసిక్ 350 మాత్రం అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా కొనసాగుతోంది.