Microsoft: మైక్రోసాఫ్ట్ లోకి శామ్ ఆల్ట్‌మన్..
స్వయంగా ప్రకటించిన సత్య నాదేళ్ల;
ఓపెన్‌ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్ ఆల్ట్‌మన్ తమ కంపెనీలో చేరనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు. తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో ఆల్ట్‌మన్ చేరనున్నారని నాదెళ్ల సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహించనున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తామువేగంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దీన్ని ఆల్ట్‌మన్ కూడా ధ్రువీకరించారు. తమ లక్ష్యం కొనసాగుతుందంటూ ఎక్స్ ద్వారా తెలిపారు. మరోవైపు ఓపెన్‌ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సంస్థతో కలిసి తాము రూపొందించిన... ప్రోడక్ట్ రోడ్‌మ్యాప్ ముందుకు సాగుతుందన్నారు. ఓపెన్‌ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మైక్రోసాఫ్ట్ లో చేరిక అనంతరం ఓపెన్ ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్తన మాజీ సహచరులపై ప్రసంశలు కురిపించారు. చరిత్ర పుస్తకాలలోకి ఎక్కే ఒక అద్భుతమైన పని చేస్తున్నారని కొనియాడారు. వారిని చూసి తాను చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. వారితో ఏదో ఒక విధంగా కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, ‘ఒక టీం, ఒక మిషన్’ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓపెన్ ఏఐ లీడర్‌షిప్ టీమ్, ముఖ్యంగా మీరా బ్రాడ్, జాసన్అ ద్భుతంగా పని చేస్తున్నారని, అది చరిత్రలో నిలిచిపోతుందని, వారిని చూస్తే చాలా గర్వంగా ఉందని ఆల్ట్‌మాన్ అన్నారు.
OpenAI లో మైక్రో సాఫ్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. ఇప్పటి వరకు $13 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. OpenAIని అభివృద్ధి చెందేలా చూడటమే సత్య నాదెళ్ల, తన ప్రధాన ప్రాధాన్యత అని సామ్ ఆల్ట్‌మాన్ అన్నారు. తమ భాగస్వాములు, కస్టమర్‌లకు పూర్తి స్థాయిలో సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. OpenAI/Microsoft భాగస్వామ్యం దీన్ని సాధ్యం చేస్తుందని ఆల్ట్‌మాన్ Xలో పోస్ట్ చేశారు.