SBI : ఎస్బీఐకి డబుల్ ధమాకా.. ప్రపంచ స్థాయి గుర్తింపుతో పాటు మరో అవార్డు కూడా.
SBI : భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త. ఎస్‌బీఐ ప్రతిష్టను పెంచేలా, అంతర్జాతీయ స్థాయిలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకు, భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకు అనే రెండు గౌరవాలు ఎస్‌బీఐకి దక్కాయి. ఎంతోమంది విమర్శించే ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.
భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డులను అందించింది. 2025 సంవత్సరానికి గాను ఎస్‌బీఐ ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంకు, భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా ఎంపికైంది.
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలలో భాగంగా ఈ అవార్డుల ప్రదానం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను కొందరు విమర్శించినప్పటికీ, ఎస్‌బీఐ ప్రపంచ స్థాయిలో ముద్ర వేయడం ఒక గొప్ప విషయం. ఈ అవార్డులపై ఎస్‌బీఐ స్పందిస్తూ.. ఖాతాదారులకు సేవ చేయడంలో తమ బ్యాంక్ చూపిన నిబద్ధతకు, అంకితభావానికి ఈ అవార్డులు దక్కినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.
ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాలను తమ విస్తృత కస్టమర్ బేస్‌కు అందించడం, టెక్నాలజీలో ముందంజలో ఉంటూ దేశంలోని అన్ని ప్రాంతాలలో సేవలను విస్తరించడం వంటి ఎస్‌బీఐ సాధనాలను గుర్తించి ఈ అవార్డులు ఇచ్చామని గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ తెలిపింది. ఎస్బీఐ అందించే సేవల పరిధి, డిజిటల్ రంగంలో దాని పురోగతి చాలా విస్తృతమైనది.
ఎస్‌బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బ్యాంక్ 52 కోట్ల మంది ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. అంతేకాకుండా, ప్రతి రోజు సగటున 65,000 కొత్త కస్టమర్లను యాడ్ చేసుకుంటుంది. ఈ భారీ సంఖ్యలో కస్టమర్లకు సేవ చేయడానికి టెక్నాలజీ, డిజిటలైజేషన్‌లో ఎస్‌బీఐ భారీగా పెట్టుబడి పెడుతోంది. ఎస్‌బీఐ మొబైల్ యాప్‌ను ఏకంగా 10 కోట్ల మంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో రోజువారీ యాక్టివ్ గా యాప్ ఉపయోగించే కస్టమర్ల సంఖ్య దాదాపు ఒక కోటి వరకు ఉంది. ఎస్బీఐ ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడం పట్ల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు.