Car Sales : హ్యుందాయ్, టయోటాకు భారీ షాక్.. సెప్టెంబర్‌లో టాటా, మారుతి జోరు.

Update: 2025-10-13 08:00 GMT

Car Sales : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సెప్టెంబర్ నెల రిటైల్ సేల్స్ నివేదిక చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఈ నెలలో టాటా మోటార్స్, మారుతి సుజుకి తమ మార్కెట్ వాటాను బలంగా పెంచుకోగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ మాత్రం మార్కెట్ వాటా తగ్గడంతో నిరాశను ఎదుర్కొన్నాయి. టాటా మోటార్స్ సెప్టెంబర్ 2025లో బలమైన పనితీరును కనబరిచింది. కంపెనీ మార్కెట్ వాటా ఏకంగా 11.52 శాతం నుంచి భారీగా పెరిగి 13.75 శాతానికి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 32,586 యూనిట్లను విక్రయించిన టాటా, ఈసారి ఏకంగా అమ్మకాల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ వృద్ధి కంపెనీకి ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో మరింత పట్టు పెరిగినట్లు స్పష్టం చేస్తోంది.

దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా తన మార్కెట్ లీడ్‌ను మరింత బలోపేతం చేసుకుంది. సెప్టెంబర్ 2025లో మారుతి ఏకంగా 1,23,242 యూనిట్ల రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. దీనితో కంపెనీ మార్కెట్ వాటా 40.83% నుంచి పెరిగి 41.17 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 1,15,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌లో దేశంలో మొత్తం ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు 6 శాతం పెరిగి 2,99,369 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 37,659 యూనిట్లను విక్రయించింది, దీంతో దాని మార్కెట్ వాటా 12.67% నుంచి స్వల్పంగా తగ్గి 12.58 శాతానికి చేరుకుంది. అయితే, ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ బలంగా ఉంది.

మరోవైపు, హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. హ్యుందాయ్ మార్కెట్ వాటా 13.72 శాతం నుంచి తగ్గి 11.96 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ 2025లో కంపెనీ 35,812 యూనిట్లు మాత్రమే విక్రయించింది (గత ఏడాది 38,833 యూనిట్లు). టయోటా కిర్లోస్కర్ మోటార్ మార్కెట్ వాటా కూడా 7.35% నుంచి తగ్గి 6.78 శాతానికి చేరుకుంది. కియా ఇండియా అమ్మకాలు స్వల్పంగా పెరిగినా, మార్కెట్ వాటా మాత్రం కొద్దిగా తగ్గింది.

టూ వీలర్ వెహికల్ మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ దూకుడు చూపించింది. కంపెనీ మార్కెట్ వాటా 22.48 శాతం నుంచి పెరిగి 25.10 శాతానికి చేరుకుంది. హీరో సెప్టెంబర్‌లో 3,23,268 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దీనికి విరుద్ధంగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్ వాటా 27.7% నుంచి తగ్గి 25.05 శాతానికి పడిపోయింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన పట్టును పెంచుకుంటూ మార్కెట్ వాటాను 18.36% నుంచి 19.11 శాతానికి పెంచుకుంది.

Tags:    

Similar News