Toyota Corolla : పేరు గొప్ప..ఊరు దిబ్బ..టయోటా కొత్త కారు టెస్ట్ రిజల్ట్స్ చూస్తే షాకవ్వాల్సిందే.

Update: 2026-01-29 11:30 GMT

Toyota Corolla : ప్రపంచవ్యాప్తంగా టయోటా కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. కానీ తాజాగా జరిగిన ఒక క్రాష్ టెస్ట్ ఫలితాలు చూస్తే టయోటా అభిమానులు షాక్‌కు గురవ్వాల్సిందే. టయోటాకు చెందిన పాపులర్ మోడల్ కొరోలా క్రాస్ సేఫ్టీ టెస్టుల్లో విఫలమై, కేవలం 2-స్టార్ రేటింగ్‌తో సరిపెట్టుకుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా క్యాంపెయిన్‌లో ఈ చేదు నిజం బయటపడింది. టయోటా కొరోలా క్రాస్ ఎస్‌యూవీని గ్లోబల్ ఎన్‌క్యాప్ పరీక్షించగా, అది పెద్దల భద్రతలో కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే సాధించింది. ఈ కారుకు మొత్తం 34 పాయింట్లకు గాను 29.27 పాయింట్లు వచ్చాయి. క్రాష్ టెస్ట్ సమయంలో డ్రైవర్, ప్యాసింజర్ తల, మెడ భాగానికి రక్షణ లభించినప్పటికీ, మోకాళ్ల వద్ద తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉందని తేలింది. డ్యాష్‌బోర్డ్ వెనుక ఉన్న గట్టి భాగాలు ప్రయాణికుల కాళ్లకు హాని కలిగించేలా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

అంతేకాకుండా ఈ కారులో సైడ్ హెడ్ ప్రొటెక్షన్ స్టాండర్డ్ ఫీచర్‌గా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దీనివల్ల సైడ్ పోల్ ఇంప్యాక్ట్ టెస్ట్ నిర్వహించగా.. అక్కడ సున్నా పాయింట్లు వచ్చాయి. అయితే, కారు బాడీషెల్ స్థిరంగా ఉందని, అది మరిన్ని లోడ్లను తట్టుకోగలదని పరిశీలకులు తెలిపారు. కానీ, కారు కింది భాగం మాత్రం అస్థిరంగా ఉన్నట్లు గుర్తించారు.

చిన్నారుల భద్రత విషయంలో కూడా కొరోలా క్రాస్ పెద్దగా ఆకట్టుకోలేదు. 49 పాయింట్లకు గాను కేవలం 33 పాయింట్లు సాధించి, 3-స్టార్ రేటింగ్‌ను పొందింది. ముఖ్యంగా 3 ఏళ్ల చిన్నారి డమ్మీకి క్రాష్ సమయంలో తలకు గాయాలయ్యే ముప్పు ఎక్కువగా ఉందని టెస్టులో తేలింది. 18 నెలల చిన్నారికి మాత్రం పూర్తి రక్షణ లభించింది. ఐసోఫిక్స్ మౌంట్‌లు ఉన్నప్పటికీ, హెడ్ ప్రొటెక్షన్ విషయంలో ఉన్న లోపాలు రేటింగ్‌ను తగ్గించాయి.

టయోటా వంటి పెద్ద కంపెనీలు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించడంపై గ్లోబల్ ఎన్‌క్యాప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూరప్ లేదా ఇతర దేశాల్లో కొరోలా క్రాస్ మోడల్స్‌కు 5-స్టార్ రేటింగ్‌లు వస్తుంటే, ఆఫ్రికా వంటి దేశాల్లో విక్రయించే కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, ఇతర సేఫ్టీ ఫీచర్లను తగ్గించడం ఏంటని ప్రశ్నించింది. అన్ని మార్కెట్లలోనూ ప్రయాణికుల ప్రాణాలకు ఒకే రకమైన విలువ ఇవ్వాలని కంపెనీలను కోరింది. ఆఫ్రికాలో కూడా కఠినమైన సేఫ్టీ నిబంధనలు రావాలని ఈ సందర్భంగా సంస్థ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News