SILVER: వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి!

త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం..?

Update: 2025-09-14 06:30 GMT

వెండి వస్తువులు, ఆభరణాలకు ఆరు నెలల్లో హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసే అవకాశం ఉందని భారతీయ ప్రమాణా మండలి (బీఐఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారీ తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఐచ్ఛిక విధానాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వెండి స్వచ్ఛతను నిర్ధారించేందుకు 800 నుంచి 999 వరకు వివిధ ప్రమాణాల ఆధారంగా హాల్‌మార్కింగ్‌ అమలు చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేక హెచ్‌యూఐడీ సంఖ్య కేటాయించనున్నారు. వినియోగదారులు డిజిటల్‌ ధ్రువీకరణ ద్వారా ఆభరణాల నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు.

బంగారు ఆభరణాల మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ అవసరమని డిమాండ్‌ పెరుగుతోందని తివారీ పేర్కొన్నారు. అయితే చిన్న విలువ గల ఆభరణాలకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం కొంత సవాలుగా ఉంటుందని అంగీకరించారు. అదేవిధంగా, విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్‌ యూనిట్ల కోసం ప్రమాణాల ముసాయిదా సిద్ధమైందని ఆయన తెలిపారు. వీటి అమలుతో దేశంలో ఈవీ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగారానికి హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి అయిన తర్వాత వినియోగదారుల్లో అవగాహన పెరిగింది. అదే విధంగా వెండి మార్కెట్ కూడా మరింత పారదర్శకత సాధించనుంది. హాల్‌మార్కింగ్‌ ద్వారా కస్టమర్లు నకిలీ లేదా తక్కువ నాణ్యత గల వెండి కొనుగోలు చేయకుండా రక్షించబడతారు. జువెల్లర్స్‌ కోసం ఇది ప్రారంభంలో కొంత సవాలుగా ఉన్నా, దీర్ఘకాలంలో విశ్వాసాన్ని పెంచుతుంది.హెచ్‌యూఐడీ సంఖ్య ద్వారా ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో చూడగలిగే విధానం డిజిటల్‌ పారదర్శకతకు దోహదం చేస్తుంది.

Tags:    

Similar News