Silver Price : ఏడాదిలోనే డబ్బులు ట్రిపుల్.. బంగారం కంటే స్పీడ్ గా దూసుకెళ్తున్న సిల్వర్!

Update: 2026-01-17 09:45 GMT

Silver Price : వెండి ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్న వెండి, పెట్టుబడిదారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే వెండి ఏకంగా 200 శాతం లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెండిపై పెట్టుబడి పెట్టేముందు కాస్త ఆలోచించి అడుగు వేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ లాభాల ఆశతో ఇప్పుడే రంగంలోకి దిగితే చిక్కుల్లో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి 8న వెండి ధర ఆల్-టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఒక కిలో వెండి ధర ఏకంగా రూ.2,59,692 కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ గరిష్ట స్థాయి నుంచి 6.3 శాతం తగ్గి రూ.2,43,324 వద్ద కొనసాగుతోంది. ధర ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం పారిశ్రామిక రంగంలో వెండికి పెరుగుతున్న డిమాండ్. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి పాత్ర కీలకం. కొత్త టెక్నాలజీతో కూడిన సోలార్ సెల్స్ తయారీకి పాత వాటికంటే 50 శాతం ఎక్కువ వెండి అవసరమవుతోంది. 2030 నాటికి సోలార్ కెపాసిటీ 17 శాతం పెరుగుతుందని అంచనా, ఇది వెండి డిమాండ్‌ను మరింత పెంచుతోంది.

కేవలం సోలార్ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వెండి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఈవీ కార్ల తయారీలో 67 నుంచి 79 శాతం వరకు ఎక్కువ వెండిని ఉపయోగిస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా వెండి వినియోగం పెరిగింది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నిర్మించే డేటా సెంటర్లు, సర్వర్లలో కూడా వెండి అవసరం భారీగా పెరిగింది. అమెరికాలో రాబోయే పదేళ్లలో డేటా సెంటర్ల నిర్మాణం 57 శాతం పెరుగుతుందని అంచనా. డిమాండ్ ఇంతలా ఉన్నా, వెండి సరఫరా మాత్రం కేవలం 1 శాతం మాత్రమే పెరుగుతోంది. ఇదే వెండి కొరతకు, ధరల పెరుగుదలకు దారితీస్తోంది.

ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు అందరూ వెండి వైపు పరుగులు తీస్తున్నారు. దీన్నే FOMO (Fear Of Missing Out) అంటే లాభాలు ఎక్కడ చేజారిపోతాయో అన్న భయం అంటారు. కానీ ఇక్కడే అసలైన ప్రమాదం ఉంది. ఇప్పటికే ధరలు కొండెక్కి కూర్చున్నాయి కాబట్టి, ఇప్పుడు భారీ మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు సిప్ పద్ధతిలో నెమ్మదిగా వెండి ఈటీఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో వెండి కేవలం ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండాలి. వెండి భవిష్యత్తు బాగున్నప్పటికీ, భారీ లాభాల తర్వాత మార్కెట్ ఎప్పుడైనా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News