Skoda : ప్రీమియం సెడాన్ మార్కెట్‌లో ప్రకంపనలు.. లాంచ్ అయిన కాసేపటికీ 100యూనిట్లు సేల్.

Update: 2025-10-17 12:45 GMT

Skoda : ప్రీమియం సెడాన్ మార్కెట్‌లో ఇప్పుడు కొత్త ఉత్సాహం నెలకొంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్కోడా ఆక్టేవియా RS ఎట్టకేలకు భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. ఈ పర్ఫార్మెన్స్ సెడాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.49.99 లక్షలు. భారతదేశం కోసం కేటాయించిన 100 యూనిట్లూ ఇప్పటికే అమ్ముడైపోయాయి. ఈ కార్ల డెలివరీ నవంబర్ 6, 2025 నుండి ప్రారంభం కానుంది. స్పోర్టీ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వాహన తయారీ సంస్థ స్కోడా ప్రకారం RS బ్యాడ్జ్ అనేది కేవలం కారు పర్ఫార్మెన్స్ కంటే చాలా ఎక్కువ. ఇది స్కోడా కంపెనీ పట్ల వినియోగదారుల భావోద్వేగ అనుబంధాన్ని, నమ్మకాన్ని సూచిస్తుంది. స్కోడా ఆక్టేవియా RS తో కంపెనీ 4 సంవత్సరాలు/100,000 కి.మీల వారంటీ, 4 సంవత్సరాల కాంప్లిమెంటరీ రోడ్-సైడ్ అసిస్టెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. భారతదేశంలో RS బ్యాడ్జ్ మొదటిసారిగా 2004లో పరిచయం చేసింది. అప్పట్లో దేశంలో మొదటి టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ కారుగా ఇది గుర్తింపు పొందింది.

కొత్త స్కోడా ఆక్టేవియా RSలో 2.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 బీహెచ్‌పి ఎనర్జీని, 370 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ సెడాన్ కేవలం 6.4 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడు గంటకు 250 కి.మీ. ఇందులోని ఛాసిస్ సెటప్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్, స్పోర్ట్స్ సస్పెన్షన్ కారు హ్యాండ్లింగ్, డ్రైవింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరుస్తాయి.

స్కోడా ఆక్టేవియా RS మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మాంబా గ్రీన్, రేస్ బ్లూ, క్యాండీ వైట్, వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్. ఈ పర్ఫార్మెన్స్ సెడాన్ 19-అంగుళాల ఎలియాస్ ఆంథ్రసైట్ అల్లాయ్ వీల్స్‌, లో-ప్రొఫైల్ 225/40 R19 స్పోర్ట్స్ టైర్లతో వస్తుంది. ఈ సెడాన్ పొడవు 4,709 మి.మీ, వెడల్పు 1,829 మి.మీ, ఎత్తు 1,457 మి.మీ. దీని వీల్‌బేస్ 2,677 మి.మీ. బూట్ స్పేస్ విషయానికొస్తే.. ఇందులో సెగ్మెంట్‌లో అత్యధికంగా 600 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. వెనుక సీట్లను మడవడం ద్వారా దీనిని 1,555 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

కొత్త స్కోడా ఆక్టేవియా RS అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ అడ్జస్ట్, మెమరీ, హీటింగ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన స్పోర్ట్స్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఇది 10 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ADAS సూట్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది.

Tags:    

Similar News