ఆర్థికంగా ఇప్పటికే పీకల్లోతు చిక్కుల్లో ఉన్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు మరో ఇబ్బంది వచ్చి పడింది. ఆ కంపెనీ రెండున్నరేళ్లుగా ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ జమ చేయడం లేదు. సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం.. 11,581మంది ఉద్యోగులకు చివరిగా 2022 జనవరిలో పీఎఫ్ డిపాజిట్ చేసింది. EPFO నోటీసులు జారీ చేయగా, సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.
ఈ ఏడాదిలో ఇప్పటికే స్పైస్‌జెట్ కంపెనీ షేరు 7.6% నష్టపోయింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే షేరు 86% రాణించినట్లే లెక్క. నిధుల కొరత కారణంగా ఈపీఎఫ్‌ఓ డిపాజిట్ల జమ ఆలస్యమవుతోందని.. జనవరి వేతనాలు కూడా ఆలస్యం అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే విమానాలను లీజుకిచ్చిన వారితో వివాదాల్లో స్పైస్‌జెట్ చిక్కుకుని ఉంది. లీజుకిచ్చిన వారిలో ముగ్గురు దివాలా పిటిషన్లను దరఖాస్తు చేయడంతో, ఎన్‌సీఎల్‌టీ ఏప్రిల్ 18న నోటీసులు జారీ చేసింది.