Suzuki Access CNG : ఏకంగా 170కిమీ మైలేజ్.. యాక్టివాకు పోటీగా సుజుకి యాక్సెస్ సీఎన్‌జీ.
Suzuki Access CNG : ఇకపై కేవలం పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలే కాదు.. గ్యాస్ ఆధారిత స్కూటర్ల హవా కూడా మొదలు కానుంది. జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి సంస్థ తమ అత్యంత ప్రజాదరణ పొందిన యాక్సెస్ స్కూటర్ సీఎన్‌జీ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ స్కూటర్ కంప్రెస్డ్ బయో-మీథేన్ గ్యాస్ (CBG)పైనా కూడా నడుస్తుంది. అంటే, ఇది సీఎన్‌జీ, సీబీజీ అనే రెండు రకాల గ్యాస్‌లపై నడిచే అవకాశం ఉన్నందున, ఇది భారత మార్కెట్‌లోకి వస్తే హోండా యాక్టివా వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. ముఖ్యంగా ఫుల్ ట్యాంక్ గ్యాస్,పెట్రోల్‌తో కలిపి ఈ స్కూటర్ ఏకంగా 170 కి.మీ వరకు ప్రయాణించగలదు.
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే సుజుకి సంస్థ యాక్సెస్ స్కూటర్‌లో ఈ వినూత్న మార్పు చేసింది. సుజుకి యాక్సెస్ స్కూటర్ సీఎన్‌జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) తో పాటు సీబీజీ (కంప్రెస్డ్ బయో-మీథేన్ గ్యాస్) పైన కూడా నడిచేలా రూపొందించబడింది. ఈ రెండు గ్యాస్‌ల ఎనర్జీ కెపాసిటీ దాదాపు ఒకేలా ఉండటం వల్ల, వీటిని ఒకే ఇంజన్‌లో ఉపయోగించేందుకు వీలు కలుగుతుంది.
డిజైన్ పరంగా ఇది దాదాపు పెట్రోల్ యాక్సెస్ మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇది గ్రీన్ ఫ్యూయల్‌పై నడుస్తుందని సూచించడానికి కొన్ని ఆకుపచ్చ రంగు డిజైన్‌లు, స్టిక్కర్‌లు అదనంగా ఉంటాయి. మైలేజ్ విషయంలో ఈ సీఎన్‌జీ/సీబీజీ స్కూటర్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లో గ్యాస్ ట్యాంక్‌ను సీటు కింద అమర్చారు. ఇది 6 లీటర్ల గ్యాస్‌ను నిల్వ చేయగలదు. గ్యాస్ నింపే నాజిల్ కూడా ఈ ట్యాంక్ దగ్గరే ఉంటుంది. దీనికి అదనంగా ఇందులో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఇచ్చారు. దీనిని బయటి నుండి సులభంగా నింపుకోవచ్చు. గ్యాస్, పెట్రోల్ ట్యాంకులు రెండూ పూర్తిగా నిండి ఉంటే, ఈ స్కూటర్ సుమారు 170 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గ్యాస్ సిస్టమ్‌ను అమర్చడం వల్ల స్కూటర్ బరువులో స్వల్ప మార్పులు వచ్చాయి. సీఎన్‌జీ/సీబీజీ సిస్టమ్ కారణంగా స్కూటర్ బరువు సుమారు 10% పెరిగింది. పెట్రోల్ యాక్సెస్ బరువు 106 కిలోలు కాగా, గ్యాస్ వెర్షన్ మరింత బరువుగా ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్ యాక్సెస్ 124సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 8.4 పీఎస్ పవర్, 10.2 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. బరువు పెరగడం వల్ల గ్యాస్ స్కూటర్ పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో కొద్దిపాటి తేడా వచ్చే అవకాశం ఉంది. సుజుకి సంస్థ గ్రీన్ టెక్నాలజీపై ఎంతగా దృష్టి పెట్టిందో హైడ్రోజన్ స్కూటర్ కాన్సెప్ట్ ద్వారా స్పష్టమవుతోంది. సుజుకి యాక్సెస్‌తో పాటు తమ బర్గ్ మన్ 400 స్కూటర్ హైడ్రోజన్ వెర్షన్‌ను కూడా ప్రదర్శించింది. ఈ హైడ్రోజన్ ట్యాంక్‌ను స్కూటర్ ఫ్లోర్ కింద ఏర్పాటు చేశారు. ఇది హైడ్రోజన్‌ను ఇంధనంగా మండించి నడుస్తుంది. ఈ హైడ్రోజన్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.