Emission Standards War : ఉద్గార నిబంధనలపై మారుతికి వ్యతిరేకంగా టాటా, హ్యుందాయ్, మహీంద్రా గళం.
Emission Standards War : భారతీయ ఆటోమొబైల్ కంపెనీల మధ్య ఉద్గార నిబంధనలపై పెద్ద వివాదం మొదలైంది. టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా & మహీంద్రా, జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ వంటి పెద్ద కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలకమైన డిమాండ్‌ను చేశాయి. అదేమిటంటే చిన్న కార్ల కోసం ప్రతిపాదించిన బరువు-ఆధారిత ఉద్గార మినహాయింపును కొత్త నిబంధనల నుంచి తొలగించాలి అని. ఈ మినహాయింపు వల్ల దేశంలో చిన్న కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి మాత్రమే లబ్ధి పొందుతుందని ఈ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మారుతి సుజుకి కూడా తన వాదనను బలంగా వినిపిస్తోంది. ఈ వివాదం వెనుక ఉన్న పూర్తి వివరాలు, కంపెనీల వాదనలు ఏంటో చూద్దాం.
భారతదేశంలో అమలులో ఉన్న కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ప్రమాణాల ప్రకారం.. 3,500 కిలోల వరకు బరువున్న అన్ని ప్యాసింజర్ కార్లకు కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గార పరిమితి ఉంటుంది. కొత్త నిబంధనల్లో సగటు CO₂ ఉద్గారాలను 113 గ్రాములు/కి.మీ. నుంచి 91.7 గ్రాములు/కి.మీ. కి తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ కఠినమైన లక్ష్యాన్ని పూర్తి చేయడం చిన్న కార్లకు పెద్ద ఎస్‌యూవీలతో పోలిస్తే మరింత కష్టం. దీని వల్ల కంపెనీలు కచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మాల్సి వస్తుంది.
కొత్త ముసాయిదా నిబంధనల్లో, ప్రభుత్వం కొన్ని చిన్న కార్లకు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. 909 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువు, 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1200cc వరకు పెట్రోల్ ఇంజిన్ ఉన్న కార్లకు ఈ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చిన్న కార్లలో సామర్థ్యాన్ని పెంచే అవకాశం పరిమితంగా ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ 909 కిలోల కటాఫ్ పూర్తిగా ఏకపక్షం అని, ఏ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఆటో కంపెనీలు ఆరోపిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఈ 909 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న కార్లలో 95 శాతం ఒకే కంపెనీ (మారుతి సుజుకి) తయారు చేస్తుందని పేర్కొంది. ఈ మినహాయింపు కేవలం మారుతికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని మిగిలిన కంపెనీలు భావిస్తున్నాయి.
పోటీ కంపెనీలు, మారుతి సుజుకి తమ వాదనలను ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలియజేశాయి. బరువు లేదా సైజు ఆధారంగా ప్రత్యేక కేటగిరీలు ఉండకూడదని మహీంద్రా పవర్ మినిస్ట్రీకి రాసిన లేఖలో పేర్కొంది. ఇది పరిశ్రమలో సమాన పోటీ లేకుండా చేసి, సురక్షితమైన, స్వచ్ఛమైన వాహనాల వైపు దేశ పురోగతిని అడ్డుకుంటుందని తెలిపింది.
ఈ మినహాయింపు ప్రపంచానికి తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని, ఇది పరిశ్రమ స్థిరత్వం, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. మారుతి సుజుకి దీనిపై స్పందిస్తూ, యూరప్, అమెరికా, చైనా వంటి మార్కెట్లలో కూడా చాలా చిన్న కార్లకు ఉద్గార నిబంధనలలో కొంత ఉపశమనం ఉంటుందని తెలిపింది. చిన్న కార్లు తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి కాబట్టి, ఈ రక్షణ నియమం CO₂ తగ్గింపు, ఇంధన ఆదా రెండింటికీ సహాయపడుతుందని వాదించింది. ఈ వివాదం కారణంగా కొత్త నిబంధనలను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇది భవిష్యత్తు కార్ల తయారీకి, ఇంజిన్ టెక్నాలజీకి ప్రణాళికలు రూపొందించాల్సిన కంపెనీలకు ఇబ్బందిగా మారింది.