Tata Nexon : టాటా నెక్సాన్ కొత్త వెర్షన్ వస్తోందా? సీక్రెట్‌గా టెస్టింగ్.. ఫోటోలు వైరల్.
Tata Nexon : టాటా మోటార్స్ తన ఫేవరెట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ విషయంలో సంచలనానికి సిద్ధమవుతోంది. మొన్నటి వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించిన నెక్సాన్, ఇప్పుడు కొత్త అవతారంలో మెరిసేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ కారుకి సంబంధించిన 'టెస్ట్ మోడల్' రోడ్లపై రహస్యంగా తిరుగుతూ కెమెరాకు చిక్కింది. టాటా నెక్సాన్ ఆర్థిక సంవత్సరం 2026లో ఏకంగా 2,16,054 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్ వన్ ఎస్‌యూవీగా నిలిచింది. అయితే ఇంత మంచి ఆదరణ ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ ఈ కారును మరింత అప్‌డేట్ చేయాలని భావిస్తోంది. తాజాగా రోడ్లపై కనిపించిన టెస్ట్ మోడల్ మొత్తం కవర్‌తో ఉండటం చూస్తుంటే, ఇది కేవలం చిన్న మార్పు కాదని, ఒక మేజర్ ఫేస్‌లిఫ్ట్ లేదా కొత్త పవర్‌ట్రెయిన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బయటకు వచ్చిన స్పై ఫోటోల ప్రకారం.. కారు బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు మరియు అల్లాయ్ వీల్స్ ప్రస్తుత మోడల్ లానే ఉన్నాయి. అయితే, కారు లోపల మాత్రం భారీ మార్పులు ఉండవచ్చని సమాచారం. కొత్త మెటీరియల్స్, మెరుగైన ఫినిషింగ్, మరిన్ని ఫ్యూచరిస్టిక్ ఫీచర్లను టాటా జోడించబోతోంది. ముఖ్యంగా ప్రత్యర్థి కార్లు ఇస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి టాటా తన అమ్ముల పొదిలో నుంచి కొత్త ఆయుధాలను సిద్ధం చేస్తోంది.
ఈ టెస్ట్ మోడల్‌కు సంబంధించి మరో బలమైన ప్రచారం జరుగుతోంది. నెక్సాన్ ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ మోడళ్లలో లభిస్తోంది. అయితే, సీఎన్‌జీలో ఇప్పటివరకు ఆటోమేటిక్ ఆప్షన్ లేదు. ఇప్పుడు టాటా తన ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పాటు సీఎన్‌జీ ఏఎంటీ వేరియంట్‌ను లాంచ్ చేసేందుకు ఈ టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే, సీఎన్‌జీ విభాగంలో నెక్సాన్ తిరుగులేని విజేతగా నిలుస్తుంది.
టాటా మోటార్స్ తన అమ్మకాలలో సుమారు 60 శాతం వాటాను నెక్సాన్, పంచ్ నుంచే పొందుతోంది. అందుకే వీటిని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడం ద్వారా మార్కెట్ షేర్‌ను కాపాడుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత నెక్సాన్ సెప్టెంబర్ 2023లో వచ్చింది కాబట్టి, 2026 చివరి నాటికి కొత్త అప్‌డేట్ రావడం సహజమే. మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడమే టాటా అంతిమ లక్ష్యం.