House Owner Tips : అగ్రిమెంట్ ముగిసినా అద్దెకు ఉన్న వాళ్లు ఇల్లు ఖాళీ చేయడం లేదా..గొడవ వద్దు ఇలా చేయండి.
House Owner Tips : సొంతిల్లు ఉన్నవారు దానిని అద్దెకు ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పొందాలని ఆశిస్తారు. అయితే, అద్దెకు ఇచ్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ తర్వాత లేనిపోని తలనోప్పులు వస్తుంటాయి. చాలా మంది యజమానులు కేవలం నమ్మకంతోనే ఇళ్లను అద్దెకు ఇస్తుంటారు కానీ, చట్టపరమైన రక్షణ కోసం రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ అగ్రిమెంట్ 11 నెలల కాలానికి ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత ఇద్దరికీ ఇష్టమైతే కొత్త అగ్రిమెంట్ రాసుకోవచ్చు, లేదంటే ఖాళీ చేయమని అడగవచ్చు.
ఒకవేళ అగ్రిమెంట్ గడువు ముగిసినా అద్దెదారు ఇల్లు ఖాళీ చేయకుండా మంకుపట్టు పడితే ఏం చేయాలి? ఇలాంటి సమయంలో చాలా మంది యజమానులు ఆవేశంతో అద్దెదారుతో గొడవ పడటం, ఇంటికి లేదా గేటుకు తాళం వేయడం, ఇంట్లోని సామాన్లను బయట పారేయడం వంటివి చేస్తారు. మరికొందరు విద్యుత్ సరఫరా లేదా నీటి కనెక్షన్ కట్ చేస్తారు. కానీ గుర్తుంచుకోండి ఇలా చేయడం చట్టరీత్యా నేరం. యజమాని ఎంత నిజాయితీపరుడైనా సరే, ఇటువంటి చర్యల వల్ల చట్టపరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.
అద్దెదారు మొండికేస్తే చేయాల్సిన మొదటి పని లీగల్ నోటీసు పంపడం. ఒక లాయర్ ద్వారా "మీ అగ్రిమెంట్ గడువు ముగిసింది, ఇన్ని రోజుల లోపు ఇల్లు ఖాళీ చేయాలి" అని నోటీసు పంపాలి. దీనివల్ల రేపు కోర్టుకు వెళ్లినా మీ పక్షాన బలం ఉంటుంది. అద్దెదారును ఖాళీ చేయించాలనుకున్నప్పుడు యజమానులు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే.. అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా అద్దె డబ్బులు తీసుకోవడం. మీరు ఒకసారి అద్దె తీసుకున్నారంటే, వారు ఆ ఇంట్లో కొనసాగడానికి మీరు అంగీకరించినట్లే లెక్క. అందుకే వారు అద్దె ఇస్తామన్నా ఖచ్చితంగా తిరస్కరించాలి.
ఒకవేళ వారు బలవంతంగా మీ UPI (PhonePe/Google Pay) కి డబ్బులు పంపినా, వెంటనే వాటిని తిరిగి పంపేయండి. "మీరు ఇల్లు ఖాళీ చేయాలి, నేను అద్దెను అంగీకరించడం లేదు" అని వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా లిఖితపూర్వకంగా వారికి తెలియజేయండి. లీగల్ నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వారు స్పందించకపోతే, మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పుడు మీరు పంపిన నోటీసులు, అద్దెను నిరాకరించిన ఆధారాలు మీకు అండగా నిలుస్తాయి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగు వేస్తే మీ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది.